‘దోస్త్‌’ అగచాట్లు

ABN , First Publish Date - 2020-09-24T08:55:28+05:30 IST

డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన ‘దోస్త్‌’ ప్రక్రియలో విద్యార్థులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.

‘దోస్త్‌’ అగచాట్లు

రిజిస్ర్టేషన్‌కు డబ్బులు కట్‌ అయినా రాని పిన్‌

కాలేజీ సెలెక్షన్‌ పేజీ రావడం లేదు

మెయిల్‌, వాట్సాప్‌ ఫిర్యాదులకు స్పందన లేదు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్ల కోసం చేపట్టిన ‘దోస్త్‌’  ప్రక్రియలో విద్యార్థులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్ర్ట్టేషన్‌ నుంచి వెబ్‌ ఆప్షన్ల వరకు  ప్రతీ దశలోనూ  ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌కు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వేలాది మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌లు ఇవ్వలేకపోయారు.  రెండో దశ కౌన్సెలింగ్‌లోనూ అవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యపై  మెయిల్‌, వాట్సాప్‌ చేస్తే అధికారులు స్పందించడం లేదు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ‘దోస్త్‌’ సర్వర్‌పై ఒత్తిడి భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంలో ఉన్నత విద్యా మండలి అధికారులు విఫలమయ్యారు. దోస్త్‌ ప్రక్రియలో విద్యార్థులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న తర్వాత రూ.400లను ఆన్‌లైన్‌లో చెల్లిస్తేనే ఐడీ, పిన్‌ నెంబరు వస్తుంది.


ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం టీవాలెట్‌తో పాటు మరో రెండు యూపీఐలను పేర్కొన్నారు. కానీ, టీవాలెట్‌లో డబ్బులు చెల్లించడం విద్యార్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.  పలుమార్లు డబ్బులు కట్‌ అయిన తర్వాతే ఐడీ, పిన్‌ నెంబర్లు వస్తున్నాయి. కాగా, దోస్త్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకుని ఫీజు చెల్లించి ఐడీ, పిన్‌ నెంబరుతో విద్యార్థి వివరాలన్నీ పొందుపరిచాక, వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియ ఇబ్బందులకు గురి చేస్తోంది. వెబ్‌ పేజీలో కాలేజీ ఆప్షన్‌ సెలెక్ట్‌ కావడం లేదు. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే ఈ తరహా ఇబ్బందులు రావడంతో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న 1,71,275 విద్యా ర్థుల్లో 1,53,323 మందే అప్షన్లు ఇచ్చారు. రెండో దశ ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కాగా, అవే  ఇబ్బందులు ఎదురయ్యాయి.

Updated Date - 2020-09-24T08:55:28+05:30 IST