కోతపడ్డ జీతాలు 3 దఫాల్లో చెల్లింపు

ABN , First Publish Date - 2020-10-01T07:28:30+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులు, పింఛనుదారులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన మొత్తాన్ని మూడు దఫాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది..

కోతపడ్డ జీతాలు 3 దఫాల్లో చెల్లింపు

ఉద్యోగులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరులో

పింఛనుదారులకు అక్టోబరు, నవంబరులో

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులు, పింఛనుదారులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన మొత్తాన్ని మూడు దఫాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులను జారీచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో మార్చి, ఏప్రిల్‌, మే మాసాలకు సంబంధించి ఉద్యోగులు, పింఛనుదారులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. కోత విధించిన ఉద్యోగుల జీతాలను మూడు దఫాల్లో, పింఛనుదారులకు రెండు దఫాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైన పేర్కొన్న మూడు మాసాల్లో పింఛనుదారులకు అక్టోబరు, నవంబరులో, అలాగే అన్నిరకాల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరులో కోత జీతాలను చెల్లించనున్నారు. కాగా, కోత విధించిన వేతనాలను చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావు, ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఖమరుద్దీన్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థికమంత్రి హరీశ్‌ రావుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-10-01T07:28:30+05:30 IST