అప్పులు చేసి పనులు..అందని బిల్లులు

ABN , First Publish Date - 2020-12-10T08:41:32+05:30 IST

పల్లెల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పలు పనులకు బిల్లులు రావడంలేదు. అప్పు చేసి పనులు చేస్తున్నామని, సకాలంలో నిధులు రాకపోవడంతో తాము మరింత అప్పుల పాలు కావాల్సివస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగినందుకు సంతోషపడాలో? అందుకు చేసిన ఖర్చులకు

అప్పులు చేసి పనులు..అందని బిల్లులు

నిధులు రాక సర్పంచుల తిప్పలు... కేంద్రం బకాయిలు రూ.780 కోట్లు

రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులూ లేవు

బిల్లులు చెల్లించాలంటున్న ప్రజాప్రతినిధులు


హైదరాబాద్‌, న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):  పల్లెల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పలు పనులకు బిల్లులు రావడంలేదు. అప్పు చేసి పనులు చేస్తున్నామని, సకాలంలో నిధులు రాకపోవడంతో తాము మరింత అప్పుల పాలు కావాల్సివస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగినందుకు సంతోషపడాలో? అందుకు చేసిన ఖర్చులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉందని మొత్తుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.780 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది.


పల్లెల్లో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులను పూర్తి చేశారు. ప్రతి పంచాయతీలోనూ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, పంట కల్లాలు, పంచాయతీ/అంగన్‌వాడీలకు సొంత భవనాల నిర్మాణాలు, నర్సరీల పెంపకం.. ఇలా అనేక పనులను ఉపాధి పథకం కింద చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.3 వేల కోట్ల విలువకు పైగా పనులు జరిగినట్లు అంచనా. అయితే, ఈ పనులు చేసిన కూలీలకు వేతనాలు అందుతున్నప్పటికీ.. మెరిటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు చేసిన నిధులు రాకపోవడంతో సర్పంచులు ఆవేదనలో మునిగిపోయారు. బిల్లులు సకాలంలో విడుదల చేసి కష్టాల నుంచి గట్టెక్కించాలని వారు కోరుతున్నారు. 


కేంద్ర, రాష్ర్టాల వ్యయం ఇలా..

ఉపాధి హామీ పథకం కింద చేసే ఖర్చులో కేంద్ర భాగస్వామ్యమే ఎక్కువ. కూలీల వేతనంలో 90ు కేంద్రమే చెల్లిస్తుంది. ఇక మెటీరియల్‌ కాంపోనెంట్‌లో 75ు కేంద్ర, 25ు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అయితే, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కేంద్రం నుంచి రూ.780 కోట్ల వరకు బకాయిలు ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదని సమాచారం.


జిల్లాల వారీగా పనుల వివరాలు..

మహబూబ్‌నగర్‌: జిల్లాలో రూ.12 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 439 వైకుంఠధామాలకు రూ.46 కోట్ల నిధుల అంచనాలతో పనులు మంజూరు చేశారు. వీటిల్లో 80 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. బిల్లులు మంజూరు చేయడం లేదని, కానీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సర్పంచులు మొత్తుకుంటున్నారు.


ఖమ్మం: జిల్లాలోని 584 పంచాయతీల పరిధిలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణం పలు చోట్ల ముమ్మరంగా సాగుతోంది. వీటికి చేసిన ఖర్చులకు బిల్లులు ఇవ్వడం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన వాటిలో రూ.8 కోట్లను రైతు వేదికల నిర్మాణ అవసరాలకు మళ్లించారని, ఇతర పనులకు బిల్లులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. 


కరీంనగర్‌: జిల్లాలో 76 రైతు వేదికలను రూ.16.72 లక్షల అంచనాతో నిర్మిస్తున్నారు. 313 వైకుంఠధామాలు, 305 పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. ఈ నిధులు గ్రామ పంచాయతీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని పేర్కొంటున్నారు.


నిజామాబాద్‌: జిల్లాలో 530 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మెటీరియల్‌ కాంపౌండ్‌ కింద పంచాయతీ నిధులు ఖర్చు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో నిధులు లేకపోవడతో సర్పంచులు అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారు.  మొత్తంగా జిల్లాలో రూ.15 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. 


సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేట మండలంలోని 31 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను, 6 క్లస్టర్లలో రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నారు. పలు గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం కూడా జరుగుతోంది. అప్పు చేసి నిర్మాణాలు చేపట్టామని, ఇప్పటివరకూ బిల్లులు రాలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో ప్రకృతి వనాలకు పంచాయతీ నిధులను వినియోగిస్తున్నారు.  


ఆత్మహత్యకు దారితీసిన.. అభివృద్ధి పనుల అప్పులు 

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం గ్రామం 2018 ఆగస్టు 2న గ్రామపంచాయతీగా ఏర్పడింది. 2019 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో యువకుడైన షేక్‌ అజారుద్దీన్‌ (27) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఏకగ్రీవ పంచాయితీలకు ప్రభుత్వం రూ. 15 లక్షలు ప్రోత్సాహక నిధులు ప్రకటించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చని సర్పంచ్‌ భావించాడు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహక నిధులు అందలేదు. అయినప్పటికీ సర్పంచ్‌ గ్రామంలో అప్పులు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టాడు. నిధులు విడుదల కాకపోగా.. పనుల విషయంలో అధికారుల ఒత్తిడి పెరిగింది. చిన్న పంచాయతీ కావడంతో ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చిడానికి సర్పంచ్‌.. తన భార్య వెండి కడియాలు తాకట్టు పెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సర్పంచ్‌ అజారుద్దీన్‌ గతనెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఉపాధి పథకం వివరాలు

ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన పని దినాలు 13 కోట్లు

ఇప్పటి వరకు పూర్తి చేసిన పనిదినాలు 12.35 కోట్లు

పూర్తి చేసిన పనుల విలువ 3602.53 కోట్లు

ఇందులో కూలీల వేతనం 2183.76 కోట్లు

మెటీరియల్‌ కాంపోనెంట్‌ 1291.50 కోట్లు 

Updated Date - 2020-12-10T08:41:32+05:30 IST