రుణమాఫీ ప్రక్రియ షురూ!

ABN , First Publish Date - 2020-03-19T09:36:58+05:30 IST

రుణమాఫీ ప్రక్రియ పదిహేను నెలలపాటు పడకేసినా ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చెప్పినట్లే మొదటి విడత

రుణమాఫీ ప్రక్రియ షురూ!

రూ.1,210 నిధులకు బీఆర్వో విడుదల 

నేడు కొలిక్కిరానున్న లబ్ధిదారుల జాబితా

మాఫీ మొత్తం నుంచి రూ.260 కోట్లు కోత

హైదరాబాద్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రుణమాఫీ ప్రక్రియ పదిహేను నెలలపాటు పడకేసినా ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చెప్పినట్లే మొదటి విడత రుణమాఫీకి రూ.1,210 కోట్లకు బుధవారం ప్రభుత్వం బీఆర్వో విడుదల చేసింది. ఈ నిధులను రూ.25వేలలోపు బకాయిలు ఉన్న 5.83 లక్షల మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. ఇది ఈ నెలాఖారుకల్లా పూర్తవుతుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే లబ్ధిదారుల తుది జాబితా ఇంకా తేలలేదు. బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ హైదరాబాద్‌లో సమావేశమైంది. గురువారం సాయంత్రానికి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తెప్పించి, ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌) ద్వారా స్ర్కీనింగ్‌ అనంతరం తుది జాబితా ఖరారు చేయనున్నారు.


ఆ తర్వాత చెక్కుల ముద్రణ ప్రారంభమవుతుంది. రైతులకు ‘అకౌంట్‌ పే’ చెక్కులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేస్తారు. చెక్కులు డ్రా చేసి రుణ బకాయిలు చెల్లిస్తామని రైతుల నుంచి లిఖితపూర్వకంగా హామీ పత్రాలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.


ప్రత్యేక పోర్టల్‌లో అన్ని వివరాలు

ఏపీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో రుణమాఫీకి ప్రత్యేక పోర్టల్‌, ఐటీ సిస్టమ్‌ రూపొందిస్తున్నారు. ఇది వ్యవసాయశాఖ కమిషనర్‌ పర్యవేక్షణలో ఉంటుంది. రైతు పేరు, తండ్రి/భర్త పేరు, కులం, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఫోన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం నంబర్లు, బ్యాంకు పేరు, ఖాతా నంబర్‌, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌, ఎప్పుడు? ఏ పంటకు? రుణం తీసుకున్నారు? అసలు ఎంత? వడ్డీ ఎంత? తదితర వివరాలు వివరాలన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేస్తారు. సంబంధిత మండల తహసీల్దార్‌, ఎంపీడీవో, ఏవోలు రుణమాఫీ పక్రియను పర్యవేక్షిస్తారు. వీరితో సంయుక్త మండలస్థాయి బ్యాంకర్ల కమిటీ (జేఎంఎల్‌బీసీ) ఏర్పాటు చేస్తారు.


గ్రామాలు, బ్యాంకుల వారీగా వివరాలు సేకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్లు సరిపోల్చుకున్న వివరాలను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. రుణమాఫీ లబ్ధిదారుల ఎంపికకు ఎక్కడికక్కడ జల్లెడ పట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క అనర్హుడికి కూడా జాబితాలో చోటు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్ర్కీనింగ్‌  కమిటీలను నియమించింది. మొదట ‘ఎన్‌పీఏ’ ఖాతాలను ఏరివేస్తారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఒక్కసారి కూడా రెన్యువల్‌ చేసుకోని ఖాతాలను బ్యాంకులు ఎన్‌పీఏగా ప్రకటించాయు. అనర్హుల గుర్తింపుతో రూ.260 కోట్ల వరకు కోతపడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.  


గ్రామసభల్లో జాబితాల ప్రదర్శన 

జిల్లా కో-ఆపరేటివ్‌ ఆడిట్‌ అధికారి తన పరిధిలోని మండలాలకు ఆడిటర్లను నియమించి స్ర్కీనింగ్‌ చేస్తారు. డిప్యూటీ కలెక్టర్‌ హోదా అధికారి ఆడిట్‌ రిపోర్ట్‌ సమావేశాలకు పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. బ్యాంకులు, జేఎంఎల్‌బీసీ ఖరారు చేసిన జాబితాను గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రదర్శిస్తారు. సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. తుది జాబితా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌కు వెళ్తుంది. దీన్ని జిల్లాస్థాయిలో బ్యాంకర్ల కమిటీ పరిశీలించి, ఐటీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి ప్రతిపాదిస్తుంది. దీన్ని ఎస్‌ఎల్‌బీసీ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ గురువారం పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో మాఫీ చేయాల్సిన మొత్తం తేలిపోతుంది. 2014-18లో రుణమాఫీ చేసినప్పుడు రూ.17 వేల కోట్లకు ప్రతిపాదనలు రాగా.. స్ర్కీనింగ్‌తో రూ.856 కోట్లకు కోత పెట్టారు. చివరకు రూ.16,144 కోట్లు రుణమాఫీ చేశారు. 

Updated Date - 2020-03-19T09:36:58+05:30 IST