అప్పుల పరిమితి 5% కావాలి

ABN , First Publish Date - 2020-04-12T08:47:08+05:30 IST

లాక్‌డౌన్‌ను మరో 2 వారాల పాటు కొనసాగించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో రైతులు నష్టపోకుండా, నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగకుండా

అప్పుల పరిమితి 5% కావాలి

ప్రధానితో వీసీలో సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను మరో 2 వారాల పాటు కొనసాగించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో రైతులు నష్టపోకుండా, నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగకుండా ఉభయ తారకంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైర్‌సపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందని, ప్రధాని సైతం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, అండగా నిలవడం తమకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తోందని చెప్పారు. రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని సూచించారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని, కనీసం 2 నెలల పాటైనా ఈ విధానం అవలంబించాలని చెప్పారు. రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే మిగతావి ఉపాధి నిధుల నుంచి చెల్లించే విధానం రావాలని, దీనివల్ల కష్టకాలంలో రైతులను ఆదుకోవడం సాధ్యమవుతుందన్నారు. ధాన్యం సేకరణ కోసమే ప్రభుత్వం రూ.25 వేల కోట్ల మేరకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిందని ప్రధానికి తెలిపారు. బ్యాంకులు బకాయిల చెల్లింపు కోసం ఒత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రిజర్వుబ్యాంకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితినీ 3ు నుంచి ఐదారు శాతానికి పెంచాలని కోరారు. రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం 6 నెలల పాటు వాయిదా వేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు.

Updated Date - 2020-04-12T08:47:08+05:30 IST