యాప్స్‌ నిర్వాహకులపై..డేటా చౌర్యం కేసులు

ABN , First Publish Date - 2020-12-25T06:11:38+05:30 IST

ఇన్‌స్టంట్‌ రుణాల పేరుతో.. దా‘రుణా’లకు పాల్పడుతూ.. రుణ గ్రహీతలతోపాటు, అతడి సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారిని వేధిస్తున్న వారిపై ఉచ్చు బిగుసుకుంటోంది. రుణగ్రహీతల మొబైల్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లను సేకరించడంపై.. సైబర్‌క్రైమ్‌ పోలీసులు సీరియ్‌సగా ఉన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు..

యాప్స్‌ నిర్వాహకులపై..డేటా చౌర్యం కేసులు

కాంటాక్ట్‌ లిస్ట్‌ చోరీపై సీరియస్‌

ఐపీసీ, ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌

చర్యలకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెడీ

రంగంలోకి ఆర్బీఐ, ఈడీ

100, 9490617310కు 

ఫిర్యాదు చేయండి: సైబరాబాద్‌ సీపీ

రుణ యాప్స్‌ వెనక విదేశీ కంపెనీలు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టంట్‌ రుణాల పేరుతో.. దా‘రుణా’లకు పాల్పడుతూ.. రుణ గ్రహీతలతోపాటు, అతడి సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారిని వేధిస్తున్న వారిపై ఉచ్చు బిగుసుకుంటోంది. రుణగ్రహీతల మొబైల్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లను సేకరించడంపై.. సైబర్‌క్రైమ్‌ పోలీసులు సీరియ్‌సగా ఉన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు.. డేటా చౌర్యం కేసులు పెడుతూ, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నారు. ఇది సీరియస్‌ నేరమని చెబుతున్నారు. ఐటీ చట్టంలో పలు సవరణలు జరిగాక.. శిక్షలు బలంగా మారాయి. ఒక వ్యక్తికి చెందిన సెల్‌ఫోన్‌/కంప్యూటర్‌/ల్యా్‌పటా్‌ప/ఎలకా్ట్రనిక్‌ ఉపకరణంలోని డేటాను అతనికి తెలియకుండా తస్కరించడం డేటాచౌర్యం కిందకు వస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 66(సీ) డేటా చౌర్యానికి కఠిన శిక్షలను నిర్ణయిస్తోంది.


దీని ప్రకారం.. నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు.. రూ. లక్ష దాకా జరిమానా విధించే అవకాశాలున్నాయి. దా‘రుణాల’ యాప్స్‌ నిర్వాహకులు.. రుణ గ్రహీతలకు తమ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో.. అన్ని ప్రివిలేజె్‌సను తీసుకుంటున్నారు. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి మొబైల్‌ ఫోన్‌ మొత్తం వారి నియంత్రణలోకి వెళ్తుంది. ఫోన్‌ వినియోగదారుడికి తెలియకుండానే.. అతడి మొబైల్‌ ఫోన్‌ కెమెరాను యాక్టివేట్‌ చేసి, అతడేం చేస్తున్నాడో చూసే వెసులుబాటు యాప్స్‌ నిర్వాహకులకు ఉంటుంది. అంతేకాదు.. చాట్స్‌, సోషల్‌ మీడియా కార్యకలాపాలు, ఫోన్‌ కాల్‌ రికార్డులు, ఎస్సెమ్మె్‌సలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ లిస్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీని ఆధారంగానే యాప్స్‌ నిర్వాహకులు రుణగ్రహీత కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారికి ఫోన్లు చేసి వేధిస్తున్నారు.


విదేశీ సంస్థల హస్తం

దా‘రుణాల’ యాప్స్‌ వెనక విదేశీ సంస్థల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టంట్‌ లోన్స్‌ యాప్స్‌ నిర్వాహకులకు ఢిల్లీ, గురుగ్రామ్‌తోపాటు.. ఇండోనేషియా, చైనా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన ఫైనాన్స్‌ సంస్థలతో సంబంధాలున్నాయని నిర్ధారించారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఈ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు కూడా ఈ విషయంపై సీరియ్‌సగా ఉన్నారు. 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులతోపాటు.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగుతున్నారు. పోలీసులు ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌ నిర్వాహకులను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే.. దేశంలో పేరుమోసిన లాయర్లు వారి తరఫున రంగంలోకి దిగినట్లు తెలిసింది.


లక్షల మందిని ఇన్‌స్టంట్‌ రుణాల ఉచ్చులోకి దింపిన ఘరానా నిందితులను కాపాడేందుకు వారు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కూడా దా‘రుణాల’పై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బాధితులు, వారి కాల్‌లిస్టులో ఉన్నవారిని వేధిస్తున్న 400 మంది టెలీకాలర్స్‌కు నోటీసులు జారీ చేశారు. వారి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.


ఆర్బీఐతో సైబరాబాద్‌ సీపీ భేటీ

ఇన్‌స్టంట్‌ దా‘రుణాల’పై సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ సీరియ్‌సగా ఉన్నారు. గురువారం ఆయన డీసీపీ రోహిణి ప్రియదర్శినితోపాటు ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకురాలి కార్యాలయానికి వెళ్లారు. రీజినల్‌ డైరెక్టర్‌ నిఖిల, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రుణాల జారీ, రికవరీ వంటి అంశాలు.. అందుకు సంబంధించిన చట్టాల గురించి వారితో చర్చించారు.  అనంతరం ఆయన ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. ఇన్‌స్టంట్‌ రుణాల నిర్వాహకుల వేధింపులపై డయల్‌-100, 9490617310 నంబర్లకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2020-12-25T06:11:38+05:30 IST