డేంజర్‌ రైడ్‌..

ABN , First Publish Date - 2020-12-20T05:13:11+05:30 IST

సైలెన్సర్‌ లేకుండా రయ్‌.. రయ్‌.. ఫట్‌.. ఫట్‌మంటూ దడ పెట్టించే పెద్ద పెద్ద శబ్ధాలు.. ఒక్క బైక్‌పైనే ముగ్గురు నలుగురు కూర్చొని స్పీడ్‌ డ్రైవ్‌లు.. పిచ్చి పిచ్చి అరుపులు, కేకలతో భయానక రైడ్‌లతో కుర్రకారు నగరంలో హోరెత్తిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై కొందరు ఆకతాయిలు చేసే ప్రమాదకర స్టంట్లతో మిగతా వాహనచోదకులు హడలెత్తిపోతున్నారు. బైక్‌ రేస్‌లతో పక్క నుంచే అతివేగంగా దూసుకెళ్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. మరికొందరైతే పోలీసులు గుర్తించకుండా నెంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌లపై వెళ్తుండడం నిత్యకృత్యమైంది. తమ పిల్లలను అదుపులో పెట్టకుండా తల్లిదండ్రులు గారాబం చేయడంతో ఇంకా రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్‌, లాఅండ్‌ ఆర్డర్‌ పోలీసులు సైతం దృష్టిసారించకపోవడంతో వీరు రెచ్చిపోతున్నారు.

డేంజర్‌ రైడ్‌..

బైకులపై నగరంలో కుర్రకారు హల్‌చల్‌
రోడ్లపై హడలెత్తిస్తున్న మైనర్‌ బైక్‌ రైడర్లు
ప్రాణాంతక విన్యాసాలతో స్టంట్లు.. భయాందోళనలో ప్రజలు
పోలీసులు నజర్‌ వేయడంలేదనే విమర్శలు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, డిసెంబరు 19 : వరంగల్‌ మహానగర రోడ్లపై కొందరు ఆకతాయిలు బైక్‌లపై విన్యాసాలు, సర్కస్‌ ఫీట్లు చేస్తూ పక్కన వెళ్లేవారిని పరేషాన్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక వరంగల్‌- కాజీపేట ప్రధాన రహదారిపై వాహనాలతో ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ బెట్టింగ్‌ కాస్తూ బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. హంటర్‌రోడ్డు, నాయుడు పెట్రోల్‌పంపు, ములుగురోడ్డు నుంచి ఏటూరునాగారం, కేయూ వందపీట్ల రోడ్డు, రింగ్‌ రోడ్డు, హన్మకొండ- హుజూరాబాద్‌ రోడ్డు వరకు రైడ్‌ చేస్తూ రూ.వేలల్లో పందెం కాస్తున్నారు. ఒకరోజు వీరి పందెం విలువ రూ.50వేల నుంచి రూ.లక్షల వరకు ఉంటుందని సమాచారం. పందెంలో వచ్చిన డబ్బులతో మద్యం షాపులు, కళ్లు మండువాల వద్ద తిష్టవేస్తూ మద్యం మత్తులో గొడవలకు దిగుతున్నారు.  

వాహనాలతో సర్కస్‌ ఫీట్లు
ఇద్దరు వెళ్లాల్సిన బైక్‌లపై ముగ్గురు, నలుగురు కూర్చొని ప్రయాణిస్తుండడం ఇటీవల పరిపాటిగా మారింది. ప్రమాదమని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడదే ఫ్యాషన్‌గా మారింది. ప్రధానంగా కేయూ మైదానం, జేఎన్‌ఎ్‌సతో పాటు విశాలమైన ప్రదేశాల్లో నైట్‌ రైడింగ్‌, నైట్‌ రేసింగ్‌, స్టంట్‌ రైడింగ్‌, వీలింగ్‌, స్టీపీ, బర్న్‌ ఔట్‌, హై చేర్‌,  12 ఓ క్లాక్‌, రోలింగ్‌ స్టాఫీ వంటి విన్యాసాలు చేస్తున్నారు. వీరిని అదుపు చేయాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హైస్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌లు కొనిచ్చిన తల్లిదండ్రులకు తమ పిల్లల బైక్‌ విన్యాసాలపై దృష్టి సారించడం లేదు. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. బైక్‌ రైడర్లలో లైసెన్సు లేని వారి సంఖ్య 90 శాతానికిపైగా ఉంటుందరి తెలిసి కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.   
వరంగల్‌ మహానగరంలో ఉదయం ఐదు గంటలకు మొదలుకొని రాత్రి 10గంటల వరకు రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వచ్చి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలతో బిజీబిజీగా ఉండే రోడ్లపై యువత చేసే బైక్‌ విన్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నళ్లను సైతం లెక్కచేయకుండా రయ్‌.. రయ్‌ మంటూ దూసుకెళ్తున్నారు. బైక్‌లపై అతివేగంగా ప్రయాణించేవారిని పట్టుకునేందుకు గతంలో ప్రత్యేక బృందాలు, స్పీడోమీటర్లు ఉండేవి. కానీ అవి ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. ఛేజింగ్‌ చేస్తున్న సమయంలో రైడర్లు ప్రమాదానికి గురైతే తామే బాధ్యులమవుతామని పోలీసులు కూడా ఒక్కోసారి వదిలేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌కు పరిమితం కాకుండా యువత ‘స్పీడు’కు కళ్లెం వేయాల్సి ఉంది. పోలీసు అధికారులు బైక్‌ రైడర్స్‌పై ప్రత్యేక దృష్టిసారించి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తల్లిండ్రులు అవగాహన కలిగి ఉండాలి..
విజయ్‌కుమార్‌. హన్మకొండ ట్రాఫిక్‌ సీఐ
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన హైస్పీడ్‌ బైక్‌లు కొనిస్తున్నామని సంతోషించడం కాదు.. ముందుగా వారికి డ్రైవింగ్‌పై అవగాహన కల్పించాలి. లైసెన్సు, హెల్మెట్‌, వాహన పత్రాలు ఉన్నాయా? లేవా అన్నీ పర్యవేక్షించాలి. సీపీ ఆదేశాల మేరకు ప్రధాన సెంటర్లలో వాహనాల తనిఖీ చేపడుతున్నాం. సైలెన్సర్‌ మార్చినట్లు కనిపిస్తే బైక్‌ను సీజ్‌ చేస్తున్నాం. స్పీడుగా వెళ్లే వాహనాలను గుర్తించి ఫొటో ఆధారంగా ఇంటికి జరిమానాలు పంపిస్తున్నాం.


రింగ్‌రోడ్డు అడ్డాగా..
బైక్‌ రైడర్లు తమ విన్యాసాలకు రింగ్‌ రోడ్డును అడ్డాగా చేసుకుంటున్నారు. ఆరెపల్లి నుంచి నష్కల్‌ వరకు రేసింగ్‌లు సాగిస్తుంటారు. ఇప్పుడు ఇంకా.. యేడాది చివరి నెల కావడంతో బైక్‌రేసింగ్‌లు జోరందుకున్నాయి. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు యువకులు బ్యాచ్‌లుగా ఏర్పడి బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. గంజాయి మత్తులో వందకు వేగం మించి రేసింగ్‌లు చేస్తున్నారు. వంగపహాడ్‌ హైవే సమీపంలోని ఓ బిర్యాని సెంటర్‌ను అడ్డాగా చేసుకుని బెట్టింగ్‌లు కాస్తూ రేసింగ్‌లకు పాల్పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. వంగపహాడ్‌, గుండ్లసింగారం, పలివెల్పుల, భీమారం, కోమట్టిపల్లి, దేవన్నపేట ప్రాంతంలో గంజాయి దమ్ముకొట్టేందుకు స్థావరాలను ఏర్పర్చుకుంటున్నారు. గుండ్లసింగారం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వీరికి గంజాయి రవాణా చేస్తూ బెట్టింగ్‌లకు ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం.. అటుగా వచ్చిన బ్లూకోల్ట్‌ సిబ్బందికి జేబులు తడుపుతుండడంతో కిమ్మనకుండా వెళ్లిపోతున్నట్టు తెలిసింది. ఈ ప్రమాదకర బైక్‌ రేసింగ్‌లో ఇటీవల ఇద్దరు యువకులకు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు.Updated Date - 2020-12-20T05:13:11+05:30 IST