రైతులకు క(వ)డగండ్లు

ABN , First Publish Date - 2020-03-21T10:35:10+05:30 IST

రాష్ట్రంలో శుక్రవారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వడగళ్లు కూడా కురవటంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరిపంటతో పాటు, చింత, మామిడి పంటలకు

రైతులకు క(వ)డగండ్లు

నేలరాలిన వడ్లు.. దెబ్బతిన్న మామిడి, చింత.. పిడుగుపాటుకు ఒకరి మృతి

(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌)

 రాష్ట్రంలో శుక్రవారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వడగళ్లు కూడా కురవటంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరిపంటతో పాటు, చింత, మామిడి పంటలకు నష్టం చేకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరగంటసేపు రాళ్లు కురవడంతో యాదగిరిగుట్ట ప్రధాన రహదారి వడగండ్లతో నిండిపోయింది. వర్షం ధాటికి వరి పంటతో పాటు, చింత, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి పూత, చింతపండు పూర్తిగా రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌ మండలంలో 1,131 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని ఆర్‌డీవో సూరజ్‌ కుమార్‌ తెలిపారు. గుండాల మండలంలో కురిసిన వడగండ్ల వానకు 898 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారి తెలిపారు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌, చిగురుమామిడి, మానకొండూరు మండలాల్లో వడగండ్ల వర్షానికి గింజ దశలో ఉన్న వరి పంట దెబ్బతిన్నది.


వరి ధాన్యం నేల రాలిపోయింది. పిందె దశలో ఉన్న మామిడి పంటకు కూడా నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొన్నారు. సైదాపూర్‌ మండలంలో అత్యధికంగా సుమారు 1500 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో  వడగండ్ల వర్షం కురిసింది. కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), దహెగాం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వాంకిడి మండలం సరండిలో మసాదే అనిల్‌(21) చింతకాయలు తెంపుతున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 


రైతులను ఆదుకోవాలి : తెలంగాణ రైతు సంఘం 

హైదరాబాద్‌ మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిన్నదని, వడగళ్లతో వడ్లు రాలిపోయినట్టు రైతు సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి, కార్యదర్శి సాగర్‌ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆహార ధాన్యాలకు ఎకరాకు రూ.20వేలు, పండ్ల తోటలకు రూ.40 వేలు, పరిహారం ఇవ్వాలని, పిడుగుపాటుతో మృత్యువాత పడిన పశువులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-21T10:35:10+05:30 IST