హైదరాబాద్‌లో జలదిగ్బంధంతో ఫోన్‌ సంబంధాలు కట్‌

ABN , First Publish Date - 2020-10-19T08:46:20+05:30 IST

హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల పాతబస్తీలో విద్యుత్తు, ఫోన్‌కాల్స్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బాబానగర్‌, బండ్లగూడ, అల్‌ జుబేల్‌ కాలనీ, బార్క్‌సలోని సలాల, ఫలక్‌నుమా తదితర ప్రాంతాలు

హైదరాబాద్‌లో జలదిగ్బంధంతో ఫోన్‌ సంబంధాలు కట్‌

కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలియక అవస్థలు

గల్ఫ్‌లో ప్రవాసీయుల ఆందోళన


(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల పాతబస్తీలో విద్యుత్తు, ఫోన్‌కాల్స్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బాబానగర్‌, బండ్లగూడ, అల్‌ జుబేల్‌ కాలనీ, బార్క్‌సలోని సలాల, ఫలక్‌నుమా తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండటంతో తమ కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకునేందుకు ప్రవాసీయులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో గల్ఫ్‌లోని ప్రవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎడారి దేశంలో తాము కష్టపడి సంపాదించినదంతా నీళ్లలో కొట్టుకుపోయిందని ఆవేదన చెందుతున్నారు. అయితే, తమ కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారన్న వార్త వారికి ఉపశమనం కలిగిస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రయత్నిస్తున్నా తన కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయానని సౌదీ అరేబియాలో పనిచేస్తున్న బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ దిల్షాద్‌ చెప్పారు. రోడ్లన్నీ నీట మునగడంతో తమ ఇంటికి ఎవరినీ పంపించే పరిస్థితి లేదని వాపోయారు. ఒక బంధువు వరదలో ఈదుకుంటూ వెళ్లి తమ ఇంటి పొరుగున ఉన్న గోడ ఎక్కి చూడగా..


తమ కుటుంబ సభ్యులు మూడో అంతస్థు పైకప్పునకు చేరుకున్నారని తెలిసిందని దిల్షాద్‌ వివరించారు. కష్టపడి కూడబెట్టుకున్న తమ సామాన్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయని అల్‌ జుబేల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సయీద్‌ చెప్పారు. మస్కట్‌లో ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహించే సయ్యద్‌ అలీ కూడా ఇలాంటి ఆవేదనే వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో అతిపెద్ద పెట్రో రసాయనాల పరిశ్రమలు సౌదీ అరేబియాలోని అల్‌ జుబేల్‌ నగరంలో ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న హైదరాబాదీలు 1980వ దశకంలో హైదరాబాద్‌లోని ఓ కాలనీకి అల్‌ జుబేల్‌ అని పేరు పెట్టుకున్నారు. ఆ కాలనీ నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. ఒమాన్‌లోని పెద్ద నగరమైన సలాల పేరిట కూడా బార్క్‌సలో సలాల అనే ప్రాంతం ఉంది. భారీ వర్షాలకు సలాల కూడా నీట మునిగింది. నగర శివారుల్లో అనుమతుల్లేకుండా వెలసిన కాలనీల్లో పలువురు ప్రవాసులు స్థలాలు కొనుగోలు చేశారు.

Updated Date - 2020-10-19T08:46:20+05:30 IST