ధరణి కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన సీఎస్
ABN , First Publish Date - 2020-11-05T22:53:40+05:30 IST
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ధరణి పోర్టల్‌కు ప్రజల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ధరణి పోర్టల్‌కు ప్రజల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన బిఆర్‌కె భవన్‌లో ఏర్పాటుచేసిన ధరణి కంట్రోల్‌రూమ్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఈపోర్టల్‌కు వస్తున్న ఆదరణను తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ ధరణి వెబ్‌సైట్‌ను 5.84 లక్షల మంది చూశారని తెలిపారు. అలాగే 2,622 మంది రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని, వీరి ద్వారా 7.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మరో 6,239 మంది స్లాట్ బుక్ చేసుకోగా వారిలో 5,971 మంది డబ్బులు చెల్లించి సభ్యులుగా చేరారని అన్నారు.
ధరణి కంట్రోల్ రూంలో 100 సభ్యులు బృందాలుగా పనిచేస్తున్నారని చెప్పారు. వీరి సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ పనితీరును సీఎస్‌తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ ఐజీ శేషాద్రి స్వయంగా పరిశీలించారు. సిస్టమ్‌పూర్తిగా సెట్ అయ్యిందన్నారు. అంతకు ముందు సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లతో ధరిణి పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పోర్టల్ పారదర్శకంగా, పటిష్టంగా సులభతర పద్దతిలో అమలు జరపాలని అన్నారు.
ఎవరి పట్ల కూడా వివక్షత చూపించ వద్దన్నారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయట పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏరోజు స్లాట్ బుకింగ్‌ను ఆరోజు పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.