మూసీ వెంట బ్రిడ్జిల నిర్మాణాలకు స్థలాలను ఎంపిక చేయండి- సీఎస్
ABN , First Publish Date - 2020-12-28T20:35:43+05:30 IST
మూసీ నది వెంట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం కోసం స్ధలాలను ఎంపిక చేయాలని బ్రిడ్జిల నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి అవకాశం

హైదరాబాద్: మూసీ నది వెంట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం కోసం స్ధలాలను ఎంపిక చేయాలని బ్రిడ్జిల నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం బిఆర్‌కె భవన్‌లో సీఎస్ అధ్యక్షతన హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ 12వ వార్షిక సమావేశం జరిగింది.
ఈసందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ హెచ్‌ఆర్‌డిఎల్ ద్వారా చేపడుతున్న మిస్సింగ్ లింక్ ప్రాజెక్టుల పురోగతని, మరిన్ని పనులను ప్రణాళికాయుతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మొదటి దశ కింద రూ. 313.65 కోట్లతో 37 మిస్సింగ్ లింక్ పనులను చేపట్టగా 23 పనులు పురోగతిలోనూ, పూర్తి అయ్యే దశలో ఉన్నాయని చెప్పారు. మిగితా పనులను రెండో దశలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. వివిధ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు తయారీలో ఉన్నాయని, వచ్చే రెండేళ్లలో వీటిని పూర్తిచేస్తామన్నారు. బ్రిడ్జిలు, ఆర్‌ఓబి, ఆర్‌యుబిలు, మిస్సింగ్‌రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని బోర్డు సమీక్షించింది.
హైదరాబాద్ నగరంలో హెచ్‌ఆర్‌డిఎల్ ద్వారా మిస్సింగ్ లింక్‌రోడ్‌ల నిర్మాణం ద్వారా మంచి కనెక్టివిటీ ఏర్పడినందుకు సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. ఈసమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, రోడ్లు, రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, కమిషనర్ ఆఫ్ పోలీస్, అంజనీకుమార్, ట్రాఫిక్‌అడిషనల్‌కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.