తెలంగాణ లాక్‌డౌన్‌ పై స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన సీఎస్‌

ABN , First Publish Date - 2020-03-25T22:30:47+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలుజారీ చేశారు.

తెలంగాణ లాక్‌డౌన్‌ పై స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలుజారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధక్కరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎస్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్చి 31వరకూ  రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సాయంత్రం 7గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కొనసాగుతుంది. నిత్యావసర సరుకులకు సంబంధించి షాపులను ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకే తెరిచి ఉంచాలి. సాయంత్రం 7గంటలకూ దుకాణాలను మూసివేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల తాము నివసించే ప్రాంతాల నుంచి 3కి.మీ. పరిధిలోనే పరిమితం కావాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. 


నిత్యావసర సరుకులను కొనుగోలుచేసేందుకు ఒక ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులకు సబంఽధించిన సమాచారం కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటుంది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిపట్ల ప్రతి రోజూ పర్యవేక్షణ ఉంటుంది. జీహెచ్‌ఎంసి కమిషనర్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ కలెక్టర్లుకీలక పాత్ర పోషిస్తారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే పోలీసులు వెంటనే వారికి సహకారం అందిస్తారు.మార్కెట్‌లో నిత్యావసర సరుకుల సరఫరా , అమ్మకాలు యధావిధిగా కొనసాగుతుంది. ధరలు పెంచి అమ్మకాలుచేసే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటారు. సంబంధిత శాఖల అధికారులు ప్రతి రోజూ ధరలను పరశీలిస్తారని, ధరలు పెంచి అమ్మేవారిపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తారు. కర్ఫ్యూ సమయంలో హాస్పిటల్స్‌, క్లినిక్స్‌, మెడికల్‌షాపులను అనుమతిస్తారు. జిల్లాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే చీఫ్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. 


ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే నిత్యావసర సరుకుల వాహనాలను అనుమతిస్తారు. కలెక్టర్లు, మున్సిపల్‌కమిషనర్స్‌, గ్రామ పంచాయితీ కార్యదర్శులు వారి ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి బాధ్యులుగా ఉంటారు. ప్రైవేట్‌సంస్థలు లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదు. అలాగే వారిని ఉద్యోగాల నుంచి తొలగించ కూడదు. జిల్లా కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని అన్ని హాస్పిటల్స్‌ను తనిఖీ చేయాలి. వాటిలో అవసరమైన మరమ్మతులను వెంటనే చేయించాలి. ఆక్సీజన్‌ పైప్‌లైన్‌, వాటర్‌పైప్‌లైన్‌, సీవరేజీ లైన్స్‌ వంటి పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేయాలి. వ్యవసాయ పనులకు ఎలాంటి అంతరాయం కలగ కూడదు. నీటి పారుదల శాఖ పనులు కూడా యధావిధిగా కొనసాగుతాయి. కాంట్రాక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌పనులు యధావిధిగా కొనసాగుతాయి. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. వారి ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలుచేస్తుంది. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లోకి వచ్చేవారిని గమనించాలి. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన గుర్తించి వెంటనే సమాచారం అధికారులకు ఇవ్వాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

Read more