తనఖా దస్తావేజులపై త్వరలో నిర్ణయం

ABN , First Publish Date - 2020-12-17T08:50:16+05:30 IST

ఆస్తుల తనఖా దస్తావేజుల(మార్ట్‌గేజ్‌ డీడ్స్‌) విషయంలో త్వరలోనే తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తనఖా దస్తావేజులపై త్వరలో నిర్ణయం

బ్యాంకర్లకు సీఎస్‌ భరోసా


హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల తనఖా దస్తావేజుల(మార్ట్‌గేజ్‌ డీడ్స్‌) విషయంలో త్వరలోనే తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు.   బీఆర్కే భవన్‌లో బుధవారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.  ఫ్లాట్ల కొనుగోలుదారులకు రుణాలు ఇవ్వడానికి అవసరమైన మార్ట్‌గేజ్‌ డీడ్లపై బ్యాంకర్లు సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో వారితో ఈ సమావేశాన్ని నిర్వహించారు.  రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌ నుంచి జనరేట్‌ అయిన స్కానింగ్‌ కాపీని బ్యాంకులకు సమర్పిస్తున్నారని, దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి టైటిల్‌ గ్యారంటీ ఉండడం లేదని బ్యాంకర్లు వివరించారు. ఇలాంటి జిరాక్స్‌ కాపీని నమ్మి ఎలా రుణాలు ఇస్తామంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా స్కానింగ్‌ కాపీలపై కొనుగోలుదారులు, అమ్మకందారులు, సబ్‌-రిజిస్ట్రార్ల డిజిటల్‌ సంతకాలు మాత్రమే ఉంటున్నాయని, ఒరిజనల్‌ సంతకాలు ఉండడంలేదని తెలిపారు. ఇలాంటి దస్తావేజులను నమ్మి రుణాలు ఇవ్వలేమని చెప్పారు. దీనిలో తగిన మార్పులు చేస్తామని సీఎస్‌ భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నట్లు తెలిసింది.  మార్ట్‌గేజ్‌ డీడ్లపై సీఎస్‌ బ్యాంకర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బ్యాంకర్లు ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ వ్యవస్థలో ప్రభుత్వం మరింత పారదర్శకతను తెస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి, రిజిస్ట్రేషన్ల శాఖకు సహకరిస్తామని చెప్పారు.

Updated Date - 2020-12-17T08:50:16+05:30 IST