పంటల బీమా ఇక లేనట్లేనా?

ABN , First Publish Date - 2020-06-25T08:11:28+05:30 IST

వానాకాలం పంటల సాగు ఒక వైపు జోరుగా సాగుతుండగా... మరో వైపు పంటల బీమా పథకం అమలుపై రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది.

పంటల బీమా ఇక లేనట్లేనా?

స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించటానికి అనాసక్తి

పరిహారం సరిగ్గా అందకపోవటమూ కారణమే

రెండేళ్లలో రైతులకు రూ.960 కోట్ల బకాయిలు

వాటాధనం చెల్లింపును భారంగా భావిస్తున్న వైనం


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగు ఒక వైపు జోరుగా సాగుతుండగా... మరో వైపు పంటల బీమా పథకం అమలుపై రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఐచ్ఛికం చేయటంతో రైతుల నుంచి స్పందన కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయకపోవటం, పంటల బీమా దిశగా రైతులను ప్రోత్సహించకపోవటంతో ఈ వానాకాలం సీజన్‌లో క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రం అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానంతో ఈ సారి వరి, కంది, పత్తి.. ప్రధాన పంటలుగా రైతులు సాగుచేస్తున్నారు. అయితే పంటల బీమా విషయంలో ఇంతవరకు రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి చర్చ, ప్రయత్నాలు లేవు. కేంద్రం 2016 సంవత్సరం వానాకాలం సీజన్‌ నుంచి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ తరఫున నోటిఫికేషన్‌ జారీచేసేది.  రాష్ట్రంలో ప్రతి సీజన్‌కు 10 లక్షలకు మించి రైతులు పంటల బీమా తీసుకున్న దాఖలాల్లేవు. ఈ ఏడాది  వచ్చేసరికి కేంద్రం నిబంధనలు మార్చేసింది. పీఎంఎ్‌ఫబీవై పథకంలో చేరటాన్ని రాష్ట్రాల ఇష్టాఇష్టాలకు వదిలేసింది. కచ్చితంగా ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఏమీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఏటా వానాకాలం సీజన్‌కు ముందు... మే నెలలోనే బీమా అమలుచేసే కంపెనీలను ఎంపికచేయటం, నోటిఫికేషన్‌ జారీ చేయటం, ప్రీమియం ధరను నిర్ణయించటం చేసేది.


ఈ సారి మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేదు. రైతులు చెల్లించే ప్రీమియం పోగా మిగిలిన ప్రీమియం మొత్తంలో రాష్ట్రం 50 శాతం, కేంద్రం 50 శాతం చెల్లించాలనే నిబంధన కూడా ఉంది. ఇది కూడా సక్రమంగా ప్రభుత్వాలు చెల్లించలేకపోతుండటంతో రైతు వాటా ప్రీమియమే కంపెనీలకు చేరుతోంది. రైతుల తరఫున చెల్లించే ప్రీమియం వాటా ధనాన్ని ప్రభుత్వాలు ఆర్థిక భారంగా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  2018 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 386.74 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రాష్ట్ర వాటా రూ.193 కోట్లు ఉండటం గమనార్హం. అలాగే 2019 ఖరీఫ్‌, రబీ కలిపి రూ.638.40 కోట్ల వాటా ధనం ఉండగా... రాష్ట్ర వాటాగా ఉన్న319 కోట్లు చెల్లించకపోవటం శోచనీయం.


అరకొర పరిహారం.. అందని వైనం

బీమా పథకంలో చేరాలనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లటానికి పరిహారం సకాలంలో రాకపోవటం కూడా మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2018-19 ఖరీఫ్‌, యాసంగి సీజన్లకు సంబంధించిన రూ.960 కోట్ల పంట నష్ట పరిహారం ఇంతవరకు రైతులకు అందలేదు. పైగా రైతులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియం ఎక్కువగా ఉంటుండగా బీమా కంపెనీల నుంచి రైతులకు వచ్చే పరిహారం విలువ తక్కువగా ఉంటోంది. ఇరు ప్రభుత్వాలు కూడా వాటా ధనాన్ని భారంగా భావిస్తుండటం, నష్ట పరిహారం సకాలంలో రాకపోవటంతో పంటల బీమా పథకంపై రైతులకు నమ్మకం పోయింది. ఇదే అదునుగా భావించి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. 


ప్రకృతి విపత్తులు వస్తే ఎలా?

రైతులకు పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండటంలేదు. ప్రతి సీజన్‌లో ఏదో ఒక రకంగా ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే రైతులకు భరోసా ఉంటుంది. కానీ ఎలాంటి ఇన్యూ ్సరెన్స్‌ చేయకుండా రైతులు పంటలు సాగుచేస్తే.. పొరపాటున జరగకూడనిది జరిగితే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందగా పంటల బీమా ప్రీమియం చెల్లించటమో, లేకపోతే ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయటమో చేస్తేనే రైతులకు రక్షణ ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.Updated Date - 2020-06-25T08:11:28+05:30 IST