వాస్తవాలు మాట్లాడితే అభాండాలా?

ABN , First Publish Date - 2020-08-20T08:43:55+05:30 IST

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శలు చేయడంపై బీజేపీ మండిపడింది

వాస్తవాలు మాట్లాడితే  అభాండాలా?

  • గవర్నర్‌కు టీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలి: రాంచందర్‌రావు 
  • కరోనాపై గవర్నర్‌ వాస్తవాలే మాట్లాడారు: విద్యాసాగర్‌రావు 
  • ఇది ప్రజాస్వామ్యానికి చేటు: కె.లక్ష్మణ్‌
  • సూచనలిస్తే విమర్శలా? 
  • బేఖాతరు వల్లే కరోనా విజృంభణ: భట్టి
  • హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలి: టి.జీవన్‌రెడ్డి
  • ప్రజలంటే సీఎంకు భయం లేదు:  జగ్గారెడ్డి


కరోనా విషయంలో గవర్నర్‌ తమిళిసై లేవనెత్తిన సమస్యలను పరిష్కరించకుండా అధికారపక్షం ఎదురుదాడికి దిగడంపై కాంగ్రెస్‌, బీజేపీ మండిపడ్డాయి. ఎమ్మెల్యే సైదిరెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ వైఫల్యం ఉందని అంగీకరించిన గవర్నర్‌.. ఈ విషయంపై కేంద్రానికి నివేదిక పంపాలని కోరాయి. మరోవైపు గవర్నర్‌ వాస్తవాలు మాట్లాడితే అభాండాలు వేస్తారా? అని బీజేపీ ప్రశ్నించింది. గవర్నర్‌ వ్యాఖ్యల వెనుక బీజేపీయే ఉండి ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన వచ్చేదని తెలిపింది.


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శలు చేయడంపై బీజేపీ మండిపడింది. గవర్నర్‌ తమిళిసై వాస్తవాలు వెల్లడిస్తే.. ఆమెపైనే అభాండాలు వేస్తారా? అని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. సైదిరెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగతమా? లేక ఆ పార్టీ తరఫున చెప్పించారా? అని ప్రశ్నించారు. కరోనాపై గవర్నర్‌  వ్యాఖ్యలు వందశాతం నిజమన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఒక డాక్టరుగా గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారని, వీటిని పాజిటివ్‌గా తీసుకుని ఉండాల్సిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌.విద్యాసాగర్‌రావు అన్నారు.


కరోనాపై ఆమె వాస్తవాలే మాట్లాడారన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల రోజులు రాబోతున్నాయని, ఇక్కడి కంటే తక్కువ బలం ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చామని తెలిపారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌పై సీఎం తన భజనపరులతో రాజకీయంగా ఎదురుదాడి చేయించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డితో గవర్నర్‌కు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఇందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షమాపణ చెప్పాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్‌ చేసిన విమర్శల వెనుక బీజేపీ లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. నిజంగానే బీజేపీ ఒత్తిడి ఉండి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చేదని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్‌తో కలిసిపోయి కేసీఆర్‌ తెలంగాణను ఎడారి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు  అన్యాయం జరిగితే పాలమూరు నుంచే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డికి గవర్నర్‌ను విమర్శించే స్థాయి లేదని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలతో రాష్ట్రం నష్టపోతోందన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మహిళల గురించి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి హెచ్చరించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళపై చేసిన  వ్యాఖ్యలకుగాను గవర్నర్‌కు సైదిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


రాష్ట్ర ప్రతిష్ఠ మంట కలిపిన ప్రభుత్వం: ఉత్తమ్‌

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రతిష్ఠను మంట కలిపిన కేసీఆర్‌ ప్రభుత్వం సిగ్గు పడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం చెందినట్లు గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాల్లో రోజుకు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం 19వేల పరీక్షలతోనే సరిపెడుతోందని విమర్శించారు.

Updated Date - 2020-08-20T08:43:55+05:30 IST