భరత్పూర్ ముఠాలపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2020-10-24T09:00:38+05:30 IST
ఓఎల్ఎక్స్ పేరుతో పదే పదే మోసాలకు పాల్పడుతున్న రాజస్థానీ కేటుగాళ్లపై పీడీ కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హైదరాబాద్ సీసీఎస్ జా

పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం
పరిశీలిస్తున్నామంటున్న సీసీసీ జాయింట్ సీపీ
హిమాయత్‌నగర్, అక్టోబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఓఎల్ఎక్స్ పేరుతో పదే పదే మోసాలకు పాల్పడుతున్న రాజస్థానీ కేటుగాళ్లపై పీడీ కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సవాల్‌గా తీసుకుని నిందితులను రాజస్థాన్ నుంచి అరెస్టు చేసి తీసుకువచ్చామని చెప్పారు. రాజస్థాన్‌లో వారి స్వస్థలాల్లో నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. అక్కడి ఎస్పీ పూర్తిస్థాయిలో సహకరించారని, ఇక్కడి నుంచి వెళ్లిన పదిమందికి తోడుగా వందమంది స్థానిక పోలీసు బలగాలను సమకూర్చడంతో మూకుమ్మడిగా దాడి చేసి నిందితులను పట్టుకోగలిగామని చెప్పారు. నిందితులను కాపాడేందుకు గ్రామస్థులంతా ఏకమై పోలీసులపై దాడికి తెగబడ్డారని, రాళ్లు రువ్వడం, వాహనాల ధ్వంసానికి పాల్పడ్డారని వివరించారు. పోలీసుల భయం లేకపోవడంతో ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో గ్రామాలకు, గ్రామాలు నేరస్థులకు అడ్డాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. భరత్పూర్ జిల్లా పరిధిలోని కల్యాణ్‌పురి, చౌరాహ్ గ్రామాలకు చెందిన దాదాపు 18 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిలో కొంతమందిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అవినాష్ మహంతి చెప్పారు.