దేశాన్ని రక్షించుకుంటాం: వామపక్ష నేతల ప్రతిజ్ఞ

ABN , First Publish Date - 2020-08-16T10:27:04+05:30 IST

జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా వామపక్ష నేతలు, కార్యకర్తలు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ...

దేశాన్ని రక్షించుకుంటాం: వామపక్ష నేతల ప్రతిజ్ఞ

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా వామపక్ష నేతలు, కార్యకర్తలు స్వాతంత్య్ర దినోత్సవం రోజు శనివారం ‘రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, దేశాన్ని రక్షించుకుంటాం’ అని ప్రతిన బూనారు. రాజధానిలోని ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట ఏర్పాటైన కార్యక్రమంలో ‘లౌకికత్వాన్ని కాపాడుకుందాం, మత తత్వాన్ని ఓడిద్దాం,  బీజేపీ మతోన్మాద చర్యలను వ్యతిరేకిద్దాం, దేశ సమైక్యతను, వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగ విచ్ఛిన్నకర శక్తులను తరిమికొడదాం’ అని నినాదాలు చేస్తూ ప్ల కార్డులను ప్రదర్శించారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వాతంత్య్రం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చదువుతుండగా మిగిలిన వారు అనుసరించారు. బ్రిటీషువారికి మద్దతు తెలిపి స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించిన వారి వారసులు నేడు అధికారంలో ఉన్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు.  రాజ్యాంగ పరిధి దాటి పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు వీరయ్య, నాగయ్య, సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-16T10:27:04+05:30 IST