ప్లాస్మా దానం.. ప్రాణదానం
ABN , First Publish Date - 2020-10-14T07:21:21+05:30 IST
ప్లాస్మా దానం.. ప్రాణదానం అని, కొవిడ్ విజేతలు ముందుచ్చి ప్లాస్మా దానం చేసి.. ..

అవగాహన పాటను విడుదల చేసిన ఎంపీ సంతోష్
4,500 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు: సజ్జనార్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్లాస్మా దానం.. ప్రాణదానం అని, కొవిడ్ విజేతలు ముందుచ్చి ప్లాస్మా దానం చేసి.. కరోనాతో పోరాడుతున్న బాధితుల ప్రాణాలు కాపాడాలని ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్ సూచించారు. ప్లాస్మా దానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాసిన ప్రచార గీతాన్ని సీపీ సజ్జనార్‌తో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో మంగళవారం విడుదల చేశారు. ఈ గీతాన్ని కళ్యాణ్ చక్రవర్తి రాయగా.. మణిశర్మ బాణీలు సమకూర్చారు. సింగర్ శ్రీరామ్, సాకేత్‌లు పాటను ఆలపించారు. అద్భుతంగా ఆలపించిన శ్రీరామ్, సాకేత్‌లను ఎంపీ సంతోష్, సీపీ సజ్జనార్ సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక కొవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్లాస్మా దానం అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సజ్జనార్‌ను ఎంపీ అభినందనలు తెలిపారు. ప్లాస్మా యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన డొనే ప్లాస్మా ద్వారా 2700 మంది కరోనా యోధులు ప్లాస్మా దానం చేసి 4500 మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడారని సజ్జనార్ తెలిపారు. ఇందుకు సహకరించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రతినిధులను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రావు, దర్శకులు వి.వి. వినాయక్, నిర్మాత సి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.