కొవిడ్‌ విధులా? ఎన్నికల డ్యూటీనా?

ABN , First Publish Date - 2020-11-25T07:30:52+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో పోరులో ముందు వరసలో ఉన్న వైద్యులకు క్షణం తీరిక ఉండడం లేదు. ప్రస్తుతానికి కరోనా కల్లోలం కొంత తగ్గినా..

కొవిడ్‌ విధులా? ఎన్నికల డ్యూటీనా?

వైద్య సిబ్బందికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులు

రంగారెడ్డిలో 300 మంది ఆశాలు, ఎఎన్‌ఎమ్‌లు

మినహాయింపు కోరుతూ కలెక్టర్‌కు లేఖ

మరణించిన/బదిలీ అయిన డాక్టర్లకూ డ్యూటీలు

పాత జాబితా ఆధారంగా విధులు అప్పగించారా?


హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారితో పోరులో ముందు వరసలో ఉన్న వైద్యులకు క్షణం తీరిక ఉండడం లేదు. ప్రస్తుతానికి కరోనా కల్లోలం కొంత తగ్గినా.. సెకండ్‌ వేవ్‌పై స్వయానా సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో.. రోగులకు వైద్యులు, వైద్యసిబ్బంది అవసరం ఎంతో ఉంటుంది. అయితే.. ఇవేమీ పట్టనట్లుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విభాగం అధికారులు.. వైద్యులకు కూడా ఎన్నికల విధులు అప్పగించారు. విచిత్రం ఏంటంటే.. ఇంతకు మునుపే చనిపోయిన వైద్యులు, సిబ్బందికి కూడా పోలింగ్‌ బూత్‌లలో విధులు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.


అంతేకాదు.. హైదరాబాద్‌లో పనిచేసి.. బదిలీపై వెళ్లిన వారి పేరిటా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులను అప్పగించారు. ఈ ఆదేశాలను బట్టి చూస్తే.. సమయం లేకపోవడంతో.. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల షీట్‌నే యథాతథంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేసే 300 మంది ఆశాలు, ఏఎన్‌ఎంలకు కూడా జీహెచ్‌ఎంసీ విధులపై ఆర్డర్లు వచ్చాయి. వీరితోపాటు.. మరో 200 మంది వైద్య సిబ్బందికి డ్యూటీలు వేశారు. ఈ నెల 30కల్లా బ్యాలెట్‌ బాక్సులు తీసుకెళ్లాలని వారికి ఆదేశాలు వెళ్లాయి.

పైగా.. 30వ తారీఖున కార్తిక పౌర్ణమి ఉండడంతో.. ఆ రోజు బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్లాలనడాన్ని మహిళా ఉద్యోగులు/వైద్య సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. అయితే.. గత ఎన్నికల సమయంలో ఉన్న డేటా ఆధారంగా వైద్యులకు కూడా విధులు అప్పగించినట్లు ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.




కొవిడా? గ్రేటరా?.. ఆందోళనలో ఆశాలు

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఆందోళకరంగానే ఉన్నాయి. ఎక్కువ కేసులు ఈ మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లాలో 52 కొవిడ్‌ (యాంటీజెన్‌) పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిని నిర్వహిస్తున్నది ఆశాలు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందే. తమకు ఎన్నికల విధులు అప్పగిస్తే.. కొవిడ్‌ పరీక్షలు ఎవరు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.


ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తమకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి మినహాయించిన సర్కారు.. కరోనాపై పోరులో ముందు వరసలో ఉన్న వైద్య సిబ్బందికీ వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.


సిబ్బంది కొరతే కారణమా?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు గాను.. 9,101 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌లో కనీసం నలుగురు సిబ్బంది అవసరం. అంటే.. మొత్తం ఎన్నికలకు కనీసం 36 వేల మంది సిబ్బం ది అవసరం. ఈ సారి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడంతో.. సిబ్బంది కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. దాంతో వైద్య సిబ్బందికి కూడా విధు లు అప్పగించారని సమాచారం.


హైకోర్టు కూడా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో వైద్య సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తే ఎలాగన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ వారం పాటు వైద్య సిబ్బంది అంతా ఎ న్నికల విధుల్లో ఉండి, పరీక్షలు నిర్వహించకుంటే.. ఆ తర్వాత వైరస్‌ వ్యాప్తి తీవ్రమై ఒక్కసారిగా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ ఎన్నికల విధుల సమయంలో తమకు వైరస్‌ సోకితే.. కొవిడ్‌ చికిత్సపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందంటున్నారు.


Updated Date - 2020-11-25T07:30:52+05:30 IST