వ్యవసాయ చట్టాలను కేంద్రం వాయిదా వేసుకోవాలి-గుత్తా

ABN , First Publish Date - 2020-12-27T21:43:42+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు అగ్రికల్చర్‌ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు.

వ్యవసాయ చట్టాలను కేంద్రం వాయిదా వేసుకోవాలి-గుత్తా

నల్గొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు అగ్రికల్చర్‌ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్దమైన మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. నల్గొండపట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 


పంటలను కొనుగోలుచేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వీడి అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని అన్నారు. వరి ధాన్యాన్నిఎఫ్‌సిఐ ద్వారా, పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలుచేసినట్టే పప్పుధాన్యాలు కూడా కేంద్రం వందశాతం కొనుగోలుచేయాలని డిమాండ్‌చేశారు. ఉత్తరాది రాష్ర్టాల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పెనునష్టం జరుగుతున్నది. అందుకే అక్కడి రైతులు మనోవేదనకు గురుతున్నారని గుత్తా పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వారు పోరాడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను, రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలని అభిప్రాయపడ్డారు. 


విద్యుత్‌ చట్టసవరణ బిల్లు వల్ల తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్‌కు ఆటంకం ఏర్పడింది. ప్రధాన మంత్రి మోదీ  మొండిగా వ్యవహరించడం సరికదన్నారు. దేశంలో 75శాతం మంది రైతులే ఉన్నారు. రైతులను ఏడిపించడం ప్రధాని మోదీకి శ్రేయస్కరం కాదన్నారు. నాగార్జున సాగర్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి సంప్రదాయం అవుతుందన్నారు.. మాప్రతిపాదనను కాదని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు అభ్యర్ధిని పోటీలో ఉంచితే టీఆర్‌ఎస్‌ పార్టీ తన వ్యూహం అమలుచేస్తుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-27T21:43:42+05:30 IST