బతుకమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2020-12-30T04:20:34+05:30 IST

బతుకమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌ తగ్గించాలి

బతుకమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌ తగ్గించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

అక్రమ నిర్మాణాలపై కౌన్సిలర్లు దృష్టి సారించాలి

మునిసిపల్‌ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం

జనగామ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిని తగ్గించాలని మునిసిపల్‌ అధికారులు, పాలకవర్గానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ కుంట చుట్టూ ప్రహరీ నిర్మించామని, అన్యాక్రాంతమయ్యే అవకాశం ఇక లేదని అన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పరిధిని తగ్గించాలని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మునిసిపల్‌ కమిషనర్‌కు సూచించారు. పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు. పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ రోడ్డులోని కుమ్మరికుంట వద్ద ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలు, బిల్లులపై కౌన్సిల్‌ చర్చించింది. సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల ఎదురుగా ఉన్న 1.38 ఎకరాల స్థలాన్ని అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి కేటాయించడమే కాకుండా కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలని కౌన్సిల్‌ తీర్మానం చేసింది. 

వాడివేడిగా చర్చలు

కౌన్సిల్‌ సమావేశంలో పలు సమస్యలపై వాడీవేడిగా చర్చలు జరిగాయి. కాంట్రాక్టర్ల నుంచి మునిసిపల్‌ అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎం.పాండు ఆరోపించగా.. బీజేపీ కౌన్సిలర్‌ బొట్ల శ్రీనివాస్‌ కల్పించుకొని అధికారులపై నిరాధార ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. 

మునిసిపాలిటీలో 160 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ అందులో సగం మంది కూడా పనిచేయడం లేదని, వారు ఏ యే వార్డుల్లో పనిచేస్తున్నారో లెక్క తేల్చాలని బీజేపీ కౌన్సిలర్‌ బొట్ల శ్రీనివాస్‌ కౌన్సిల్‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 

సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఏడాది దాటినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని 17వ వార్డు కౌన్సిలర్‌ జక్కుల అనిత సభ దృష్టికి తీసుకొచ్చారు. 

పట్టణంలో సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని, పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని బీజేపీ కౌన్సిలర్‌ మహంకాళి హరిశ్చంద్రగుప్త కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. 


Updated Date - 2020-12-30T04:20:34+05:30 IST