కష్టాలు అధిగమిస్తేనే తెల్ల ‘బంగారం’!
ABN , First Publish Date - 2020-05-21T08:45:47+05:30 IST
రాష్ట్రంలో పత్తి పంట సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే పత్తి సాగవుతోంది.
విత్తింది మొదలు ప్రతిదశలోనూ పత్తికి చీడపీడల బెడద
ఎకరానికి రూ. 33 వేల నుంచి రూ. 35 వేల పెట్టుబడి
రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు
గత సీజన్‌లో 52.55 లక్షల ఎకరాల్లో పంట సాగు
సీఎం కేసీఆర్ తాజా టార్గెట్ 70 లక్షల ఎకరాలు
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి పంట సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే పత్తి సాగవుతోంది. కనీస దిగుబడి గ్యారెంటీ ఉండటం.. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలగడం, మార్కెట్ భద్రత ఉండటం, అన్నింటికీ మించి కోతులు, అడవి పందుల బెడద అస్సలు ఉండకపోవడంతో పత్తి సాగు దిశగా రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. రాష్ట్రంలో పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలైతే ఏటికేడు ఇది పెరుగుతూ గత సీజన్‌లో 52.55 లక్షల ఎకరాలను చేరుకుంది. రాష్ట్రంలో నీటి లభ్యత పెరగడంతో పత్తి సాగును 70 లక్షల ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలషిస్తున్నారు. రాష్ట్రంలో పత్తి మిల్లులు గణనీయంగా ఉండటం, ఆరు నెలల వ్యవధిలో ఒక కోటి బేళ్లు ఉత్పత్తిచేసే సామర్థ్యం మన జిన్నింగ్ మిల్స్‌కు ఉండటంతో పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే నిర్ణయం
ఉత్పత్తి ఖర్చు ఎక్కువే
తెల్ల బంగారంగా అభివర్ణించే పత్తి పంటకు మిగతా పంటలతో పోల్చితే ఉత్పత్తి ఖర్చు ఎక్కువే. క్వింటా పత్తి ఉత్పత్తికి సగటున రూ. 10 వేలు ఖర్చవుతోంది. పంటల బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు కాకుండా ఎకరానికి రూ.33 వేల నుంచి రూ. 35 వేల దాకా పెట్టుబడి అవుతోంది. దిగుబడి విషయానికి వస్తే రేగడి భూముల్లో నీళ్లు పెడితే ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు, వర్షాధారంగా అయితే 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుంది. చెలక భూముల్లో నీళ్ల వసతి ఉంటే 6-7 క్వింటాళ్లు, వర్షాధారంగా అయితే 3-4 క్వింటాళ్లు వస్తుంది. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర ప్రకారం మంచి దిగుబడి వస్తే ఎకరానికి రూ. 66,600 నుంచి రూ. 83,250 ఆదాయం వస్తుంది.
ఇందులో పెట్టుబడి ఖర్చు రూ. 35 వేలు పోనూ ఎకరానికి రూ.48వేల దాకా గిట్టుబాటు అవుతుంది. అయితే రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, చీడ పీడల బెడదకు పత్తి దిగుబడి 10 క్వింటాళ్లు దాటే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యవసాయశాఖే పత్తి సగటు దిగుబడిని ఎకరానికి 8 క్వింటాళ్లు వస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపింది. వ్యవసాయశాఖ లెక్క ప్రకారం ఎకరానికి సగటున రూ. 44,400 ఆదాయం వస్తోంది. రూ. 10 వేల నుంచి రూ. 11 వేలు మాత్రమే రైతుకు మిగులుతోంది.
చీడపీడల బెడద సమస్య
పత్తి పంటకు చీడపీడల బెడద ఎక్కువే. పత్తి గింజ నాటగానే వానలు పడకపోతే విత్తనం కుళ్లి పోతుంది. మొలకెత్తిన తర్వాత 2 ఆకులు వేయగానే ‘పెంకు పురుగు’ దాడిచేసి కాండాన్నే కట్ చేస్తుంది. వాన పడకుండా ఉంటే పేనుబంక, తామర పురుగు ఆశిస్తుంది. వర్షాలు బాగాపడితే ‘పచ్చదోమ’ పడుతుంది. రసంపీల్చే పురుగు 60 రోజుల వరకు వస్తుంది. కలుపు సమస్య మొదలుకాగానే ‘పిండినల్లి’ వస్తుంది. కాయలు కాయగానే తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ప్రతాపం చూపిస్తాయి. నవంబరులో చలికి ‘గులాబీరంగు కాయతొలుచు’ పురుగు దాడి చేస్తుంది.
వీటికితోడుగా వేరుకుళ్లు, వడలు తెగులు లాంటి రోగాలు కూడా వస్తాయి. ఇన్ని చీడపీడలు, రోగాలు, నీటి సమస్యలను తట్టుకొని రైతులు పత్తి పండించటం చాలా కష్టం అవుతుంది. వర్షాలు అనుకూలిస్తే జూన్ 15 తేదీ నుంచి, జూలై 15 వరకు కూడా పత్తి విత్తనాలు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. జూలై 15 దాటిపోతే దిగుబడి తగ్గుతుంది. పంటల సాగు విధానంపై గురువారం కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పత్తి సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి, తగిన పరిష్కార మార్గాలు అన్వేషించాల్సి ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం
కరోనా ప్రభావంతో జిన్నింగ్ మిల్లులు, గార్మెంట్లు, స్పిన్నింగ్ అంతా బంద్ అయింది. యూరప్ గార్మెంట్ల ఆర్డర్లన్నీ క్యాన్సల్ అయ్యాయి. దాంతో స్పిన్నింగ్ మిల్లులు దారం క్యాన్సల్ చేశాయి. ఫలితంగా ట్రేడర్లు ఇచ్చే బేళ్లు క్యాన్సల్ అయ్యాయి. ఈ సీజన్ లో 43 లక్షల బేళ్లు సీసీఐ కొనుగోలు చేసింది. 13 లక్షల బేళ్లను ప్రైవేటు ట్రేడర్లు కొన్నారు. మరో 4 లక్షల బేళ్ల పత్తి మార్కెట్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో సీజన్లో 80 సెంట్లు ఉండగా... ఇప్పుడు 60 సెంట్లకు వచ్చింది. అంటే క్యాండీకి (రెండున్నర బేళ్లు)రూ. 10 వేలు తగ్గిపోయింది. ఈ లెక్కన క్వింటాకు రూ.వెయ్యి ధర తగ్గిపోయింది. మరో రెండేళ్ల వరకు ఎమ్మెస్పీకి మించి ధర పలికే అవకాశంలేదని వ్యాపారులు చెబుతున్నారు. గుజరాత్‌లో కోటి బేళ్లు, మహారాష్ట్రలో 80- 90 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుండగా 60 లక్షల బేళ్ల ఉత్పత్తితో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
కోటి బేళ్ల కెపాసిటీ ఉంది..కక్కిరాల రమేశ్, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో 350 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఆరు నెలల వ్యవఽధిలో ఒక కోటి బేళ్లను ఉత్పత్తిచేసే జిన్నింగ్ ఇండస్ట్రీ కెపాసిటీ ఇక్కడ ఉంది. గత సీజన్‌లో 60 లక్షల బేళ్ల ఉత్పత్తి రాష్ట్రంలో జరిగింది. 70 లక్షల ఎకరాలకు పత్తి సాగు పెరిగితే మరో 25 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుంది. 85 లక్షల బేళ్లు ఉత్పత్తి అయినా రాష్ట్రంలో ఉన్న జిన్నింగ్ కెపాసిటీ కంటే ఉత్పత్తి తక్కువే అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటే ప్రైవేటు ట్రేడర్లు ధర ఎక్కువ పెట్టయినా పంటను కొంటారు.
లేదంటే ఎమ్మెస్పీకి కొనుగోలు చేయటానికి సీసీఐ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. పత్తి సాగు పెరిగితే జిన్నింగ్ ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.స్వాగతించదగినదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పత్తి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించి, సీసీఐ ద్వారా కొనుగోలు చేయిస్తుంది. మార్కెట్లో డిమాండ్ ఉంటే కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొంటారు. హెక్టారుకు రూ.87,500 స్కల్ ఆఫ్ ఫైనాన్స్ ఉండటం కూడా పత్తి సాగు పెరగటానికి కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరగడమే కాదు.. దిగుబడి కూడా బాగానే ఉంటోంది. పత్తి పంట దిగుబడి రూ.35.83 లక్షల టన్నుల నుంచి 68.58 లక్షల టన్నులకు పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.