‘కరోనా’ పై కట్టుదిట్టమైన చర్యలు

ABN , First Publish Date - 2020-03-24T08:25:02+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగం గా ఈనెల 31 వరకు రాష్ర్టాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు..

‘కరోనా’ పై కట్టుదిట్టమైన చర్యలు

నర్సంపేట : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగం గా ఈనెల 31 వరకు రాష్ర్టాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు.. జిల్లాలో ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు. అత్యవసరాల సేవలు తప్పితే వ్యాపార, వాణి జ్య సంస్థలన్నింటినీ మూసివేశారు. రోడ్లపైకి జనాలు రాకుం డా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బారి కేడ్లను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు తీసుకున్నారు. పాలు, కిరాణాషాపులు, పెట్రోల్‌ బంకులు, కూరగాయల మార్కెట్‌ లు మినహా మిగితా అన్నిరకాల షాపులు మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి కొకరిని నిత్యావసర సరుకుల కొనుగోలుకు అనుమతించా రు. కొనుగోళ్లకు వచ్చే వారితో రోడ్లపై నామమాత్రంగా జనసంచారం కనిపించింది. మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ  నిర్మానుశ్యమయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంగించి న కార్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.  


 పోలీసుల ముమ్మర తనిఖీలు

లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లాలోని 16 మండలాల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలను చేశారు. సరైన కారణంగా లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని మండలాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించా రు. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.  


నిత్యావసరాలకు వెసులుబాటు.. 

మార్చి 31 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌లో ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలకు వెసులుబాటు కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సోమ వారం పాల అమ్మకాలు, కిరాణ షాపులు, వాటర్‌ ప్లాంట్లు, కూరగాయల దుకాణాలు తెరచిఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలిరావడంతో దుకాణాలు కిటకిట లాడాయి. దేవాలయాల మూసివేసి ఉండగా, బార్లు, వైన్‌షాపులపై ఆంక్షలు కొనసాగాయి. 


 కూరగాయల కోసం ప్రజల పాట్లు..

జిల్లా వ్యాప్తంగా కూరగాయల కొనుగోళ్లలో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. నర్సంపేట కూరగాయాల మార్కె ట్‌లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు జరపగా, కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో వినియోగదారు లు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ అనంతరం వ్యాపారులు కొద్దిపాటి సరుకులనే మార్కెట్‌కు తీసుకురాగా కొనుగోళ్లు జరిపేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు. నిన్న మొన్నటి వరకు రూ. 10కి కిలోన్నర విక్రయించిన టమా టాలను రూ. 20 నుంచి 50 వరకు విక్రయించారు. బీర కాయలు రూ. 50. బెండకాయలు రూ. 40 నుంచి రూ. 45 అమ్మారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకే కూరగాయాల విక్రయాలను అనుమతించిన అధికారులు అనంతరం మార్కెట్‌ను ఖాళీ చేయించారు. తక్కువ సరు కులు రావడంతో చాలా మందికి కూరగాయలు దొరకక  వెనెక్కి వెళ్లారు. ఈనెల 31 వరకు కూరగాయల మార్కెట్‌తో పాటు ఎన్టీఆర్‌ విగ్రహం, అంబేద్కర్‌ సెంటర్‌, ఫాఖాల్‌రోడ్‌, వరంగల్‌రోడ్‌ ప్రాంతాల్లో కూరగాయల విక్రయాలు చేపడితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. 


ఇళ్లలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు..

జిల్లా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.  అత్యవసర సేవల విభాగాల అధికారులు మినహా మిగితా ప్రభుత్వ శాఖల అధికారులు ఇళ్లకు పరిమితమయ్యారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పాటించాలన్న ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామాలు, పల్లెలు, తండాలు, పట్టణ ప్రాంత ప్రజలంతా బయటకు రాలేదు. ఇళ్లలోనే కాలక్షేపం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో గడిపారు. 

Updated Date - 2020-03-24T08:25:02+05:30 IST