రోడ్డుకు అడ్డంగా కారు.. కార్పొరేటర్‌‌తో యువతి వాగ్వాదం

ABN , First Publish Date - 2020-09-14T14:39:32+05:30 IST

ఓ కార్పొరేటర్‌ ఇంటి ఎదుట ఉన్న పార్కింగ్‌ విషయంలో అడిగినందుకు దాడి చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేసిన

రోడ్డుకు అడ్డంగా కారు.. కార్పొరేటర్‌‌తో యువతి వాగ్వాదం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఓ కార్పొరేటర్‌ ఇంటి ఎదుట ఉన్న పార్కింగ్‌ విషయంలో అడిగినందుకు దాడి చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేసిన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శేరిలింగంపల్లిలో శనివారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌యాదవ్‌ నల్లగండ్లలోని లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-2లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి 10.30 గం టల సమయంలో ఇంటి ఎదురుగా నివసిస్తున్న అనూన్య అనే యువతి తన కారులో వచ్చింది. అయితే అప్పటికే అక్కడ రోడ్డుపై చాలాకార్లు నిలిపి ఉన్నాయి. అందులో అనూన్య ఇంటి ఎదురుగా నాగేందర్‌ యాదవ్‌కు చెందిన రెండు వాహనాలు ఉన్నాయి. కాలనీ సెక్యూరిటీని తీసుకొచ్చిన ఆమె కార్పొరేటర్‌ను పిలిచి కార్లను తీయాలని కోరింది. ఈ విషయంలో ఆమె, ఆమె తండ్రి కార్పొరేటర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. నాగేందర్‌ యాదవ్‌ అనూన్య తండ్రితో మాట్లాడుతుండగా అనూన్య, ఆమె సోదరి చెరోవైపు నుంచి మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. దీన్ని గమనించి కార్పొరేటర్‌ వారిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు కల్పించుకుని ఇరువురికి సర్దిచెప్పారు. ఈ విషయాన్ని అనూన్య సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.


కార్పొరేటర్‌ నాగేందర్‌ యాదవ్‌పై చందానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు

నల్లగండ్ల లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-2లో నివాసం ఉండే అనూన్య కార్పొరేటర్‌ నాగేందర్‌ యాదవ్‌పై చందానగర్‌ ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేసింది. అనూన్య శనివారం రాత్రి 10.30 గంటలకు కారులో తన ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి ఎదుట కారు పార్కింగ్‌ విషయంలో నాగేందర్‌ యాదవ్‌కు అనూన్యకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని అనూన్య తన మొబైల్‌లో వీడియో తీస్తుండగా ఎందుకు తీస్తున్నావని నాగేందర్‌ యాదవ్‌ ఫోన్‌ను లాక్కోవడానికి వెళ్లాడు. అతడి చెయ్యి తన చెంపపై తాకినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై హమీద్‌పాషా తెలిపారు.

Updated Date - 2020-09-14T14:39:32+05:30 IST