కరోనా నామ సంవత్సరే..

ABN , First Publish Date - 2020-12-30T07:07:18+05:30 IST

‘‘చైనాలో కొత్త వైరస్సేదో వచ్చిందట.. లాక్‌డౌన్‌ పెట్టారట.. వూహాన్‌ అనే ఊరు మొత్తం దెయ్యాల దిబ్బలాగా ఖాళీగా అయిపోయిందట..’’ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజుల్లో పత్రికల్లో వచ్చిన కథనాల సారాంశమిది! కానీ..

కరోనా నామ సంవత్సరే..

‘‘చైనాలో కొత్త వైరస్సేదో వచ్చిందట.. లాక్‌డౌన్‌ పెట్టారట.. వూహాన్‌ అనే ఊరు మొత్తం దెయ్యాల దిబ్బలాగా ఖాళీగా అయిపోయిందట..’’ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజుల్లో పత్రికల్లో వచ్చిన కథనాల సారాంశమిది! కానీ.. అది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది ప్రాణాలు తీసి, కోట్లాది మంది ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిగతుల్ని దెబ్బతీసి.. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనే ధ్వంసం చేసే మహమ్మారి అని ఆరోజు ఎవరూ ఊహించలేదు! సాధారణంగా ఒక ఏడాది గురించి చెప్పుకోవాలంటే.. కష్టసుఖాల కలబోత ఉంటుంది! కానీ.. 2020 మాత్రం ప్రపంచ ప్రజలందరికీ కష్టాల సంవత్సరమే. మునుపెన్నడూ ఎవరూ ఏ దేశమూ ఎరుగని సంక్షోభమిది. అయితే.. చివర్లో మాత్రం కొంత సాంత్వన. మానవాళి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా.. ఏడాది లోపే ఆ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్లు రావడం కొంత ఊరట. అంతలోనే కొత్త స్ట్రెయిన్‌ పేరిట మరో టెన్షన్‌!! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ ఏడాది గురించి చెప్పాలంటే.. కరోనా, లాక్‌డౌన్‌ తప్ప మరేదీ గుర్తురాని పరిస్థితి. కానీ.. అంతకుమించి చాలా జరిగాయి. ఆ విశేషాల సమాహారం..


మన దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. కరోనాకు పుట్టినిల్లయిన వూహాన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థినికి ఆ వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఫిబ్రవరిలో మరో రెండు కేసులు కేరళలోనే నమోదయ్యాయి! అది మొదలు నానాటికీ కేసుల సంఖ్య పెరిగి పెరిగి ఒక దశలో రోజుకు 90 వేల కేసులు దాటేశాయి. అమెరికా తర్వాత.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా భారత్‌ నిలిచింది. సెప్టెంబరు 17న అత్యధికంగా 97,894 కేసులు నమోదయ్యాయి. అక్కణ్నుంచీ క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం 20 వేల దిగువకు వచ్చేశాయి. డిసెంబరు చివరి నాటికి దేశంలో కేసుల సంఖ్య 1.02 కోట్లు దాటింది. వాటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 శాతం కన్నా తక్కువే. ఇక.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మార్చి 24 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. అన్‌లాక్‌తో క్రమంగా కోలుకుంటున్నాయి కానీ.. ఇప్పటికీ కరోనా మునుపటిస్థాయికి చేరలేదు!


ఏడాదిలోపే వ్యాక్సిన్‌!

సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ లేదా ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి, దాన్ని పరీక్షించి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కనీసం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా 15 ఏళ్ల దాకా పడుతుంది. కానీ.. కరోనా వాక్సిన్‌ను శాస్త్రజ్ఞులు ఏడాదిలోపే అందుబాటులోకి తెచ్చారు. చరిత్ర సృష్టించారు. గత ఏడాది నవంబరు-డిసెంబరుల్లో కరోనా వైరస్‌ తొలిసారి చైనాలో వెలుగుచూడగా.. జనవరి నుంచి అది మిగతా దేశాలకు విస్తరించింది. చైనాలో కేసులు పెరుగుతున్నప్పుడు శాస్త్రజ్ఞులు దాని జన్యుక్రమాన్ని పరిశీలించి వీలైనంత వేగంగా వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడ్డారు. చైనా, రష్యాలు అందరికన్నా ముందు వ్యాక్సిన్‌లను తయారుచేసినప్పటికీ.. వాటి ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి చూపకుండానే తమ ప్రజలకు ఆ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించాయి. కాబట్టి వాటిని పక్కన పెడితే.. సరైన శాస్త్రీయ సమాచారాన్ని ప్రపంచానికి చూపి, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్‌ ఫైజర్‌. ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో ఆ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌ను డిసెంబరు 8 నుంచి బ్రిటన్‌ అధికారికంగా ఇవ్వడం ప్రారంభించింది. అంటే.. ప్రపంచాన్నే వణికించిన వైరస్‌ పనిపట్టే వ్యాక్సిన్‌ను మన శాస్త్రజ్ఞులు ఏడాదిలోపే అందుబాటులోకి తెచ్చారన్నమాట. మానవ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో సమర్థమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. మానవాళి సాధించిన శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధికి నిదర్శనం కరోనా వ్యాక్సిన్లు.


వలస సంక్షోభం

ప్రపంచంలో ఏ దేశమూ ఎదుర్కోని సంక్షోభాన్ని కరోనా సమయంలో భారతదేశం ఎదుర్కొంది. అదే.. రివర్స్‌ మైగ్రేషన్‌! ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని ఉన్న ఊరు నుంచి వేరే ఊళ్లకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన నిరుపేదల జీవితాలు లాక్‌డౌన్‌ దెబ్బకు కుదేలయ్యాయి!! ఉన్న చోట ఉపాధి కోల్పోయి.. సొంత ఊరికి వెళ్దామంటే రవాణా సౌకర్యాలు లేక.. దాదాపు నాలుగు కోట్ల మంది వలస కార్మికులు వేలాది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్లిన దృశ్యాలు కనీవినీ ఎరుగనివి.  18 నెలల చిన్నారిని భుజాన వేసుకుని 2000 కిలోమీటర్ల దూరం నడిచిన దైన్యం ఒకరిదైతే.. తండ్రిని వెనక సీటుపై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కిన స్థైర్యం మరొక బాలికది!! బిహార్‌లో శ్రామిక్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఒక మహిళ రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో చనిపోతే, అభం శుభం తెలియని ఆమె మూడేళ్ల కుమారుడు తల్లి మృతదేహంపై కప్పిన దుప్పటి తనపై కప్పుకొంటూ, తీస్తూ ఆడుకుంటున్న దృశ్యాలు.. యావద్దేశాన్నీ కలచివేశాయి. ఈ వలస సంక్షోభంలో.. ప్రమాదల వల్ల, ఆకలివంటి కారణాలతో దాదాపు 198 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. 


అన్నదాతల ఆగ్రహం

ఎన్ని కష్టాలనైనా ఓర్పుగా భరించే రైతన్నలు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహించిన సంవత్సరమిది! ఆరుగాలం పంటచేలో శ్రమించే అన్నదాతలు.. ఆగ్రహంతో రోడ్డెక్కిన ఏడాది ఇది. రైతులకు మేలు చేస్తాయంటూ మోదీ సర్కారు అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు.. వాస్తవానికి కార్పొరేట్లకు మేలు చేసేవిగా ఉన్నాయంటూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి నిరసన తెలుపుతున్నారు. వణికించే చలిలో సైతం పట్టుదలగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.


అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం

ఐదు శతాబ్దాల ఆరాటం, పోరాటం.. శతకోటి హిందువుల ఆకాంక్ష.. ఈ సంవత్సరం నెరవేరింది! అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న శంకుస్థాపన జరిగింది. అయితే.. అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ వేడుక కరోనా  కారణంగా సాదాసీదాగా నిరాడంబరంగా జరిగింది. ఆరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు.. 40 కిలోల వెండి ఇటుకను, 1989లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు పంపిన ఇటుకల్లో తొమ్మిదింటిని భూమిపూజ స్థలంలో ఉంచారు. రెండు వేలకు పైగా పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, వందకు పైగా పవిత్ర నదుల నుంచి తెచ్చిన జలాలతో శంకుస్థాపన పూర్తిచేశారు. 


హైదరాబాద్‌ వైపు.. ప్రపంచం చూపు..

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తోంది.  నగరంలోని పలు సంస్థలు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వ్యాక్సిన్‌ నిల్వ, రవాణాకు అవసరమైన కోల్డ్‌ చైన్‌ వ్యవస్థలను మెరుగుపరచుకుంది. భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌తోపాటు.. ముక్కు ద్వారా పీల్చే వ్యాక్సిన్‌ తయారీకి కృషి చేస్తోంది. అరబిందో ఫార్మా.. కరోనాపై పోరాడే తొలి ‘మల్టీటోప్‌ పెప్టైడ్‌ ఆధారిత’ వ్యాక్సిన్‌ (యూబీ 612) తయారీకి కొవాక్చ్‌కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  హెటెరో సంస్థ కూడా ఆర్డీఐఎ్‌ఫతో.. ఏడాదికి 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ఇవేకాదు.. కరోనా పై పోరులో ఇన్నాళ్లుగా ఉపయోగపడిన రెమ్డెసివిర్‌, ఫావిపిరవిర్‌ వంటి ఔషధాల తయారీలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు కీలకపాత్ర పోషించాయి.


వెళ్లిపోయారు!

సంగీత ప్రియులకు, కళా రంగానికి.. కరోనా వల్ల కలిగిన అతి పెద్ద నష్టం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం! దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు 40 వేలకు పైగా పాటలతో అలరించిన ఆ మధుర గాయకుడు కరోనా బారిన పడి కోలుకున్నా.. దానివల్ల కలిగిన దుష్ప్రభావాలతో మరలిరాని లోకాలకు తరలిపోయారు. అలాగే.. భారత రాజకీయ యవనికపై అపర చాణక్యుడుగా పేరొందిన ప్రణబ్‌ ముఖర్జీ, ఏపీ మాజీ మంత్రి పైడి మాణిక్యాలరావు, సోనియాగాంధీకి రాజకీయ సలహాదారు అయిన అహ్మద్‌ పటేల్‌ ఇలా ఎందరో రాజకీయ ప్రముఖులు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తనదైన విలక్షణ నటన, వాచికంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. బాలీవుడ్‌ వెటరన్‌ రిషీకపూర్‌, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కేన్సర్‌తో కన్నుమూశారు.

Updated Date - 2020-12-30T07:07:18+05:30 IST