మాకేదీ రక్షణ?
ABN , First Publish Date - 2020-06-11T09:36:30+05:30 IST
మాకేదీ రక్షణ?

వైద్యం చేయాలా? వద్దా?.. గాంధీ ఎదుట జూనియర్ డాక్టర్ల ధర్నా
దాడి చేసిన వారిని శిక్షించాలి, సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు
ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన పోలీసులు
మీడియాను నియంత్రించడంపై వైద్యుల ఆగ్రహం.. ఈటల చర్చలు
అవసరమైతే స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుకు హామీ
ఎట్టకేలకు ఆందోళన విరమించి విధుల్లో చేరిన వైద్యులు
ఇద్దరు నిందితులపై ‘కొత్త చట్టం’ ప్రకారం కేసుల నమోదు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, జూన్ 10(ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు మరోసారి ఆందోళనకు దిగారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలోని మూడో అంతస్థులో వైద్యులపై ఇద్దరు వ్యక్తులు కుర్చీలు విసిరి దాడికి యత్నించగా.. అదే రోజు రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా బుధవారం ఉదయం 120మంది జూనియర్ వైద్యులు ఆస్పత్రి నుంచి ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చారు. అంతకుముందే ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన పోలీసులు.. వారిని నిలువరిం చేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి గేటును తోసుకుంటూ బయటి కొచ్చిన వైద్యులు.. రోడ్డుపై మూడు గంటల పాటు ధర్నా చేపట్టారు. ‘‘మాకేదీ రక్షణ? వైద్యం చేయాలా? వద్దా? మా సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ వెంటనే గాంధీ ఆస్పత్రికి రావాలి’’ అంటూ నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా అక్కడికి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కనీసం ఫొటోలు తీయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు.. కాసేపటి తర్వాత మీడియా పాయింట్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్, ఈటల వచ్చేంత వరకూ వెనక్కి తగేద్గి లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జూనియర్ వైద్యులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్, కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లోనూ వైద్య విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
నిందితులపై కొత్త చట్టం ప్రకారం కేసులు
వైద్యులపై దాడి చేసిన ఇద్దరు నిందితులపై కేంద్రం తీసుకొచ్చి కొత్త చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు 332, 188, 269, 270, 271 సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టారు. వైద్యులు ధర్నా చేస్తుండడంతో వారిని ఆస్పత్రి మొదటి అంతస్థులోని జైలు వార్డులోనే ఉంచారు. కాగా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి జూనియర్ డాక్టర్లకు ధైర్యం చెప్పారు. సంక్షోభ సమయంలో సేవలు అందిస్తున్న వైద్యుల కృషిని అందరూ అభినందించాలని కోరారు.
దాడులు దురదృష్టకరం: ఈటల
వైద్యులపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజం కోసం పని చేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులతో చర్చించేందుకు ఈటల స్వయంగా గాంధీ ఆస్పత్రికి వచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు వారితో చర్చలు జరిపారు. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డీసెంట్రలైజేషన్‌పై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. డాక్టర్ల కమిటీతో ప్రతి వారం గాంధీలోనే సమావేశమవుతానని పేర్కొన్నారు. విపత్తు సమయంలో ధర్నాలు చేయడం సరికాదన్నారు. దీంతో తాము ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించి.. జూనియర్ వైద్యులు విధులకు హాజరయ్యారు.
వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు
ఏప్రిల్‌లో ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం
ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. దాడులకు పాల్పడిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా గత ఏప్రిల్‌లో పాత చట్టాన్ని సవరించింది. ఈ మేరకు అంటువ్యాధుల చట్టం-1897కు సవరణలు చేసి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేసు తీవ్రతను బట్టి శిక్షను విధించనున్నారు. దాడుల తీవ్రత తక్కువ ఉంటే ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్షను విధించడంతో పాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. దాడి తీవ్ర త ఎక్కువగా ఉండి బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆస్పత్రులను ధ్వంసం చేస్తే వాటి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తారు.