గాలితో జాగ్రత్త..మాస్క్ ఇక మహా రక్షణ..
ABN , First Publish Date - 2020-07-10T10:18:20+05:30 IST
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చి చెప్పడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు గాలితో వ్యాధి వ్యాపించే అవకాశం

గాలిలోనూ కరోనా వైరస్ ప్రయాణం
క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతున్న కేసులు
పోలీసులు, వైద్యులను వెంటాడుతున్న మహమ్మారి
వరంగల్ అర్బన్ : గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చి చెప్పడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఇప్పటి వరకు గాలితో వ్యాధి వ్యాపించే అవకాశం లేదని డబ్ల్యూహెచ్‌వో చెప్పినా.. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని తమ పరిశోధనల్లో తేలినట్లు డబ్ల్యూహెచ్‌వో లేఖ రాయగా ఆ సంస్థ దీనిని అంగీకరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తుండంతో ఈ పరిణామం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
మరిన్ని జాగ్రత్తలు అవసరం
ఇప్పటి వరకు మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించాలని సూచించిన అధికారులు ప్రస్తుతం కరోనా వైరస్ గాలిలో ప్రయాణించే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తతతో వ్యవహరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మాస్కే మన ఆయుధం..
కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం, గుంపులుగా ఉండక పోవడం, చేతులు, ముఖాన్ని తరచుగా శుభ్రంగా కడుక్కోవడం లాంటి పద్ధతులను అవలంభిస్తున్నారు. వీటిన్నింటిలో మాస్క్ ధరించడం అతి ముఖ్యంగా మారింది. పోలీసులు, ఇతర అధికారులు కఠినంగా వ్యవహిరించినపుడే ప్రజలు మాస్క్‌లు ధరించడం, ఆ తర్వాత ఆ అంశాన్ని తేలికగా తీసుకుంటున్నారు. రాజకీయ నాయకుల సమావేశాలు, వేడుకలు, ఆందోళనలు, నిరసనలు, హరితహారం కార్యక్రమాల్లో మాస్కుల ధారణ, భౌతిక దూరం నిబంధనలు బేఖాతరవుతున్నా పోలీస్ అధికారులు ఏం చర్య తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
వైద్యులు, పోలీసులకు కరోనా
జిల్లాలో పోలీసులను కరోనా వెంటాడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 మంది కానిస్టేబుళ్ళు, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలకు కరోనా సోకినట్టు సమాచారం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో సన్నిహితంగా మెలగడం, అధికార కార్యక్రమాల్లో సమూహాలుగా కలిసి ఉండాల్సి వస్తుండడంతో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. దీనికి తోడు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది డాక్టర్లు, నర్సులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడడం కలవరపరుస్తున్న అంశం. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎంజీఎంలో అధికారులు విఫలమయ్యారని అక్కడి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రక్షణ సామగ్రిని సైతం సరిగా అందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఒక పీజీ డాక్టర్ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై గాంధీలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు గాలి ద్వారా వ్యాప్తి చెందితే ఎంజీఎంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉంది.
క్రాస్ వెంటిలేషన్ ఉండాలి డాక్టర్ సురేష్, చాతీ వైద్యనిపుణులు- ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ .
కరోనా పాజిటివ్ రోగి, అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారితో భౌతికదూరం పాటించాలి. రోగితో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు తప్పనిసరి ఎన్-95 మాస్కులను ధరించాలి. ఇళ్లలో క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. గాలి ఒక మార్గం నుంచి వస్తూ మరో మార్గం ద్వారా వెళ్లడమే క్రాస్ వెంటిలేషన్. వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇతరులతో మాట్లాడే టప్పుడు ఒక మీటర్ దూరంలో నిల్చొని మాట్లాడాలి. తుమ్ములతో ఇబ్బంది పడుతున్న వారు రెండు మీటర్ల దూరంలో ఉండాలి. మూసి ఉన్న గదుల్లో పాజిటివ్ రోగులు ఉండాల్సి వస్తే ఎక్జిట్ ప్యాన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి.