కరోనా పుట్టిళ్లు

ABN , First Publish Date - 2020-05-17T08:14:49+05:30 IST

అపార్ట్‌మెంట్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుక.. ఏకంగా 23 మందికి కరోనా వైరస్‌ సోకడానికి కారణమైంది. హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌ పరిధిలోని మాదన్నపేటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో....

కరోనా పుట్టిళ్లు

బర్త్‌డే పార్టీల ద్వారా వైరస్‌ విస్తరణ.. 

ఒకే అపార్ట్‌మెంట్‌లో 39 మందికి 

ఇప్పటికే  16.. తాజాగా 23 మందికి నిర్ధారణ

ఇంతమందికి ఒకే సారి సోకడం ఇదే ప్రథమం

రాష్ట్రంలో కొత్తగా 55 కేసులు.. గ్రేటర్‌లోనే 44

మరో 8 మంది వలస కార్మికులకు వైరస్‌

రైళ్లలో వచ్చిన వారిలో ఐదుగురికి  లక్షణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అపార్ట్‌మెంట్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుక.. ఏకంగా 23 మందికి కరోనా వైరస్‌ సోకడానికి కారణమైంది. హైదరాబాద్‌ సంతో్‌షనగర్‌ పరిధిలోని మాదన్నపేటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమార్తె బర్త్‌డే వేడుక కొంపముంచింది. ఇప్పటికే పలు విడతల్లో ఆ అపార్ట్‌మెంట్‌లోని 16 మంది వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. 13 ఫ్లాట్లున్న ఈ అపార్ట్‌మెంట్‌లో 59 మంది నివసిస్తుండగా 54 మందిని క్వారంటైన్‌కు పంపారు. ఈనెల 9న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. ఆ తర్వాత విడతల వారీగా 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా శనివారం 23 మందికి వైరస్‌ సోకిందని తేలడంతో మొత్తం బాధితుల సంఖ్య 39కి పెరిగింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో 11 నెలల పాపతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులు ముగ్గురు, ఓ గర్భిణి ఉన్నారు. మరో ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉందని, ఇంకా నలుగురు వృద్ధులకు కరోనా పరీక్షలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలో ఒకటే అపార్ట్‌మెంట్‌లో ఇంత మందికి ఒకే సారి వైరస్‌ సోకడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ను కరోనా కట్టడి ప్రాంతంగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అక్కడ బారికేడ్లు ఏర్పాట్లు చేసింది. కాగా, రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 55 కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లోనే 44 కేసులు వచ్చాయి. సంగారెడ్డిలో ఇద్దరికి, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. అలాగే, మరో 8 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. వీరిలో జగిత్యాలకు చెందిన ఇద్దరు ముంబై నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ల సంఖ్య 1509కు చేరగా, ఇందులో వలస కేసుల సంఖ్య 52కు పెరిగింది. శనివారం వైరస్‌ నుంచి మరో 12 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి బయటపడినవారి సంఖ్య 971కి చేరుకుంది. వివిఽధ ఆస్పత్రుల్లో 504 మంది చికిత్స పొందుతున్నారు. 


‘కామన్‌ బాత్‌రూమ్‌’ ఘటనలో మరో 8

కామన్‌ బాత్‌రూమ్‌ వినియోగించిన కుటుంబాల్లో మరో 8 మంది వైరస్‌ బారిన పడ్డారు. కాగా, లక్డీకాపూల్‌కు చెందిన 55 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకింది. అలాగే, కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఉన్న అనుమానితుల్లో ఏడుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఆయుర్వేద ప్రభుత్వ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉన్న 120 మందిలో 20 మందికి కరోనా సోకినట్లు తేలింది. చెస్ట్‌ ఆస్పత్రిలో ఒకరికి కరోనా రాగా గాంధీ ఆస్పత్రికి తరంచారు. గోల్నాక డివిజన్‌లోని అశోకానగర్‌కి చెందిన వ్యక్తికి(39) పాజిటివ్‌గా తేలింది. అతడికి మద్యం తాగే అలవాటు ఉందని, మద్యం కొనుగోలు చేసే సమయంలో సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. 


రైళ్ల ద్వారా 1697 మంది రాక

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): పలు రైళ్లలో శనివారం రాష్ట్రానికి చేరుకున్న ఐదుగురికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రైల్వేస్టేషన్లలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసే క్రమంలో వీరికి జ్వరం ఉన్నట్లు తేలింది. కాగా, ఇప్పటి వరకూ 15 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గమనించి క్వారంటైన్‌కు తరలించారు. రైళ్ల ద్వారా శనివారం సాయంత్రం వరకు 1697 మంది రాష్ట్రానికి వచ్చినట్లు సర్కారు వెల్లడించింది. 


‘గాంధీ’కి తరలిస్తుండగా ఒకరి మృతి

ఓ ఆస్పత్రి నుంచి కొవిడ్‌ రోగిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మంగళ్‌హాట్‌కు చెందిన ధర్మషేసింగ్‌ (45) ఈనెల 14న ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో చేరాడు. అతడికి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడని కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. 


యాదాద్రి జిల్లాలో ఒక్కరోజే నలుగురికి..

యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన మరో నలుగురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆలేరు మండడలం శారాజీపేటకు చెందిన ముగ్గురికి, చౌటుప్పల్‌ మండలంల నారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఒకరికి వైరస్‌ సోకింది. అలాగే, జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం మల్కాపూర్‌ వాసికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. మహారాష్ట్రలోని భీవండిలో పని చేసే ఆ మహిళ నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మల్కాపూర్‌కు చేరుకుంది.

Updated Date - 2020-05-17T08:14:49+05:30 IST