మాస్కుల కొరతపై ప్రభుత్వం దృష్టి...మహిళలతో తయారీకి చర్యలు

ABN , First Publish Date - 2020-04-15T13:02:56+05:30 IST

మాస్కుల కొరతపై ప్రభుత్వం దృష్టి...మహిళలతో తయారీకి చర్యలు

మాస్కుల కొరతపై ప్రభుత్వం దృష్టి...మహిళలతో తయారీకి చర్యలు

మహబూబ్‌నగర్: కరోనా సోకకుండా మాస్క్‌లు తప్పనిసరి అన్న నిబంధన విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మెడికల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఫేస్ మాస్క్‌ల రేట్లను అమాంతం పెంచడం, అందుబాటులో లేకుండా చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. మహిళలతో మాస్కులు, పీపీఈ కిట్ల తయారీకి పూనుకుంది.  

మార్కెట్లో మాస్కుల కొరత ఏర్పడం, ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలకు మాస్కులు అందుబాటులో ఉంచాలని మహబూబ్‌నగర్ అధికారులు భావించారు. జిల్లాలో భారీ మొత్తంలో మాస్కుల తయారీకి గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీకారం చుట్టింది. పాలమూరు మహిళా సమాఖ్య సభ్యులను భాగస్వామ్యం చేస్తూ జిల్లా కేంద్రం సమీపంలో టీటీడీసీలో మాస్క్‌లు, పీపీఈ కిట్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది.


మహబూబాబ్‌నగర్ జిల్లాలోని ఆరు మండలాల్లో 250 మంది మహిళలు మాస్క్‌లు, పీపీఈ కిట్ల తయారీలో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పటికే లక్షన్నర మాస్కులు తయారు చేయగా, మరో 50వేల మాస్కులు సిద్ధమవుతున్నాయి.  రోజుకు ఒక మహిళ నాలుగు నుంచి ఐదు పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. అలాగే ఒక్కో మహిళ ఒక్క రోజులో 100 నుంచి 150 మాస్కులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రతీ రంగంలో ప్రతీ కార్మికుడు ఉపాధి కోల్పోయిన తరుణంలో మాస్కుల తయారీ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి లభించినట్లు అయ్యింది. 


జిల్లాలో పదివేల పీపీఈ కిట్లను తయారు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు, ప్రజలకు మాస్కులను అందుబాటులో ఉంచారు. పాలమూరు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తయారైన దాదాపు ఐదు వేల పీపీఈ కిట్లను జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. 


మాస్కుల తయారీకి ముందుకు వచ్చిన మహిళా సంఘాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. వీటికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్డర్లు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలన్నీ స్పందిస్తే ఏ జిల్లాలోనూ మాస్కులు అందుబాటులో లేవనే మాటే వినిపించదని, అధిక ధరలకు విక్రయించే వారి సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2020-04-15T13:02:56+05:30 IST