కేంద్ర బృందం బిజీ బిజీ

ABN , First Publish Date - 2020-04-26T07:43:34+05:30 IST

రాష్ట్ర రాజధానిలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతుండటంపై ....

కేంద్ర బృందం బిజీ బిజీ

  • హైదరాబాద్‌లో కరోనా కట్టడిపై ఆరా
  • గచ్చిబౌలి ఆస్పత్రి, అక్షయపాత్ర ఫౌండేషన్‌,
  • అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించిన సభ్యులు
  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో బృందం సమావేశం
  • నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో పర్యటన
  • ఏపీలో వెయ్యి దాటేసింది! 
  • ఒకేరోజు 61 మందికి వైరస్‌ నిర్ధారణ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతుండటంపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోకా నేతృత్వంలో ప్రజారోగ్య సీనియర్‌ స్పెషలిస్టు డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ హేమలత, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన శేఖర్‌ చతుర్వేదితో కూడిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (ఐఎంసీఆర్‌) 3 రోజుల పర్యటనకుగాను శనివారం నగరానికి వచ్చింది.


తొలిరోజు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని సందర్శించారు. అంతకుముందు కోకాపేటలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ను పరిశీలించారు. ఫౌండేషన్‌ ద్వారా నగరంలో మొత్తం 200 కేంద్రాల్లో లక్షన్నర మందికి రోజూ రెండుసార్లు భోజనం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం అన్నపూర్ణ కేంద్రం, వలస కార్మికుల శిబిరానికి వెళ్లారు. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. చివరగా నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని కంట్రోల్‌ రూంను పరిశీలించారు. శనివారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సర్కారు చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.


మరోవైపు వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా శనివారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల సీఎ్‌సలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర బృందం సభ్యులు ఆదివారం డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కట్టడి ప్రాంతాలకు వెళతారు. నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలిస్తారు. మెహిదీపట్నంలోని రైతుబజార్‌కు, మంగళ్‌బస్తీలోని బస్తీ దవాఖానకు వెళతారు.  


నిజామాబాద్‌లో మరో కేంద్ర బృందం 

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు శనివారం కేంద్ర బృందం వచ్చింది. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి, అనంతరం జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.


Updated Date - 2020-04-26T07:43:34+05:30 IST