తెలిసింది గోరంతే..!
ABN , First Publish Date - 2020-07-10T09:14:32+05:30 IST
తెలిసింది గోరంతే..!

ఇప్పటికీ అంతుచిక్కని కొవిడ్-19
6 నెలలైనా తెలియని విషయాలెన్నో..
మహమ్మారి గుట్టు విప్పే పనిలో శాస్త్రవేత్తలు
కొవిడ్ వైరస్ మన శరీర కణాల్లోకి ఎలా ప్రవేశిస్తుందో తెలుసు.. వాటిని ఎలా హైజాక్ చేస్తుందో తెలుసు.. కొందరి రోగనిరోధక శక్తి వైర్‌సను ఎలా ఎదుర్కొంటుందో కూడా తెలుసు.. వైర్‌సను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధికి తొలి అడుగులు వేయడమూ తెలుసు.. కానీ, మనకు కరోనా మహమ్మారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియవు. అలాంటి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
అందరికీ ఒకే లక్షణాలు ఎందుకుండవు?
కొవిడ్ అందరిపైనా ఒకే విధమైన ప్రభావం చూపించదు. కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో కనిపించవు. దీనికి కారణం మన జన్యువుల్లో ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి దాకా జరిగిన పరిశోధనల్లో.. నాలుగు జన్యువుల వల్ల ఈ తేడాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఐస్‌లాండ్‌కు చెందిన డీకోడ్ జెనెటిక్స్ కంపెనీకి చెందిన కేరీ స్టీఫెన్‌సన్ 4 వేల మంది జన్యువులపై చేసిన అధ్యయనంలో ఈ 4 తేడాలను గుర్తించారు. కొవిడ్ వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా రావడానికి.. ఏబీవో రక్తపు గ్రూపును నిర్ధారించే జన్యువు; మానవ కణాల్లోకి వైర్‌సను సులభంగా పంపే జన్యువు కారణాలని తేల్చారు. ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే మరో రెండు జన్యువుల వల్ల కూడా తేడాలు ఏర్పడుతున్నాయని తేల్చారు. అయితే మరిన్ని పరిశోధనలు జరిగితే తప్ప వైరస్ అందరికీ ఒకేలా సోకినా.. లక్షణాలు వేర్వేరుగా ఎందుకున్నాయనే విషయం తెలియదు.
రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుంది?
మన శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఇవి కొద్ది కాలం పాటు మన శరీరంలోనే ఉండి మళ్లీ వైరస్ రాకుండా కాపాడతాయి. కొవిడ్ వచ్చిన తర్వాత మన శరీరంలో ఎంత కాలం యాంటీబాడీలు ఉంటాయనే విషయంలో శాస్త్రవేత్తలు కచ్చితమైన నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇప్పటి దాకా జరిపిన పరిశోఽధనల్లో వైరస్ సోకి, లక్షణాలు తగ్గిన 15 రోజుల వరకూ ఈ యాంటీబాడీలు ఉంటాయని తేల్చారు. అయితే ఈ యాంటీబాడీల సంఖ్య, వాటికి ఉండే శక్తి.. వైరస్ ఎంత తీవ్రంగా సోకిందనే విషయంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘‘ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందితే.. ఎక్కువ యాంటీబాడీలు ఏర్పడతాయి. ఎక్కువ కాలం ఉంటున్నాయి’’అని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త జార్జి చెబుతున్నారు. సార్స్ వ్యాధి సోకిన వారిలో 12 ఏళ్ల తర్వాత కూడా యాంటీబాడీలు ఉంటాయని.. కొవిడ్ కూడా సార్స్ మాదిరి వ్యాధేనని అంటున్నారు. చాలా సందర్భాల్లో మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలతో పాటు టీసెల్స్‌ను విడుదల చేస్తుంది. ఈ టీ సెల్స్ మనకు దీర్ఘకాలంలో రోగ నిరోఽధక శక్తిని పెంచడంలో ఉపకరిస్తాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు.
వైరస్ ఎలా పుట్టింది?
కరోనా ఏ జంతువు నుంచి మానవులకు వ్యాపించిందనేది అంతుచిక్కడం లేదు. పరిశోఽధనల్లో యూనాన్‌లో తిరిగే గబ్బిలాల్లోను, మలయన్ హార్స్‌షూ అనే రకం గబ్బిలాల్లోను కొవిడ్-2 వైరస్ ఉందని తేలింది. యూనాన్ గబ్బిలాల్లోని వైరస్ జన్యువులు 96శాతం.. మలయన్ హార్స్‌షూ గబ్బిలాల్లోని వైరస్ 93 శాతం కొవిడ్-2ను పోలి ఉంది. చైనా శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల ఆధారంగా యూనాన్ గబ్బిలాల ద్వారానే ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే నిజమైనా వైరస్ మానవులకు ఎలా సోకిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల దక్షిణ చైనాలో అక్రమంగా రవాణా అవుతున్న మలయన్ పెంగోలియన్స్‌ను పట్టుకున్నారు. వాటిలోని వైరస్ కొవిడ్-19కు 92 శాతం పోలి ఉందని తేలింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే తప్ప అసలు విషయం బయటపడే అవకాశం లేదు.
వైరస్ మరింత ప్రమాదకరంగా మారిందా?
ఒకరి నుంచి మరొకరికి సోకినప్పుడు వైరస్‌లో మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పులను శాస్త్ర పరిభాషలో మ్యూటేషన్లు అంటారు. వీటి ఆధారంగా వైరస్ బలపడుతోందా లేక బలహీనపడుతోందా? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్పగలుగుతారు. ‘‘ఇది కొత్త వైరస్. అందువల్ల ఎన్ని రకాల మ్యూటేషన్లు ఏర్పడ్డాయి? వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందనే విషయం ఇంకా తెలియదు’’అని బ్రిటన్‌లోని గ్లాస్‌గోవ్ వర్సిటీకి చెందిన డేవిడ్ రాబర్ట్‌సన్ చెప్పారు. మ్యూటేషన్ల వల్ల టీసెల్స్ వైర్‌సను గుర్తించలేవు. ఎక్కువ మ్యూటేషన్లు ఉంటే వ్యాక్సిన్ల తయారీ కూడా చాలా కష్టమవుతుంది.
- స్పెషల్ డెస్క్