10 జిల్లాలు భద్రం

ABN , First Publish Date - 2020-04-26T07:34:09+05:30 IST

హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా....

10 జిల్లాలు భద్రం

  • 3 జిల్లాల్లో కేసులే లేవు
  • 7 జిల్లాల్లో వచ్చి తగ్గాయి 
  • వరుసగా నాలుగో రోజూ తగ్గాయి!
  • శనివారం కేవలం 7 కేసులు నమోదు
  • రాజధానిలో 6, వరంగల్‌లో ఒకటి 
  • గద్వాలలో కరోనా మృతుడి ఇంట్లో
  • పని అమ్మాయి జ్వరంతో మృతి
  • రాజస్థానీ వ్యాపారికీ పాజిటివ్‌ 
  • బేగంబజార్‌ సేట్‌ కూతురు, కొడుక్కీ
  • చక్కెర వ్యాపారులైన సోదరులకూ
  • మలక్‌పేట మార్కెట్లో కలకలం 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా.. పది జిల్లాల్లో మాత్రం ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేదు. శనివారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పరిశీలిేస్త ఈ విషయం స్పష్టమవుతుంది. ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కానివి వరంగల్‌ రూరల్‌, వనపర్తి, భువనగిరి జిల్లాలు ఉన్నాయి.


ఈ మూడు జిల్లాల్లో అనుమానితుల రక్త నమూనాలు ేసకరించగా ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా బయట పడలేదు. మిగతా ఏడు జిల్లాలైన నారాయణపేట, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌లో కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయినప్పటికీ.. వారంతా చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా ఈ జిల్లాలలో కొత్తగా పాజిటివ్‌ కేసులు రాలేదు. అంటే, యాక్టివ్‌ కేసుల్లేవు. దాంతో మొత్తం పది జిల్లాల్లో ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేనట్లయింది. 

  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒకరికి, రామగుండంలో ఒకరికి పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ కూడా అయ్యారు.
  • మంచిర్యాల జిల్లాలో ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో హైదరాబాదులో మరణించింది. ఈ గ్రామం నుంచి మొత్తం 45 మందికి చేశారు. అందరికీ నెగటివ్‌ వచ్చింది.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఒకరు ఇటలీ నుంచి రాగా, డీఎస్పీ, ఆయన కుమారుడు, వంట మనిషికి కరోనా వచ్చింది. నలుగురూ డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో 243 మంది నమూనాలు సేకరించగా, అందరికీ నెగిటివ్‌ వచ్చింది. 
  • సిద్దిపేట జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదయింది.  రోగి పూర్తిగా కోలుకున్నాడు. 
  • నారాయణపేట్‌ జిల్లాలో రెండు నెలల శిశువు కరోనాతో మృతి చెందాడు. 22 మందికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. 
  • మహబూబాబాద్‌ జిల్లా గడ్డి గూడెంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. పూర్తిగా కోలుకున్నాడు. 

గ్రామీణ ప్రాంతాల్లోనూ

గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 83 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 26 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. గద్వాల జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదవగా వీరిలో 13 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. నిర్మల్‌ జిల్లాలో మొత్తం 23 మందిలో 8 మంది,  సంగారెడ్డిలో మొత్తం 8 కేసుల్లో ఆరుగురు, జగిత్యాలలో మూడు కేసుల్లో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో వచ్చిన ఏడు కేసుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ఒక్క కేసు కూడా కాలేదు. 




Updated Date - 2020-04-26T07:34:09+05:30 IST