కరోనా టీకా ఫ్రీ
ABN , First Publish Date - 2020-11-27T07:00:17+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నగర ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర

జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ
ఎల్‌ఆర్‌ఎస్ రద్దు.. ఆక్రమణలపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్.. ఉచితంగా తాగునీరు
సిటీబస్సులు, మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల సాయం.. బీమా
కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు, ఫ్రీగా నల్లా నీళ్లు
వడ్డీ లేకుండా సెలూన్లకు రూ.15 వేల రుణం
టూ వీలర్, ఆటోలపై పెండింగ్ చలానాలు రద్దు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు, వైఫై
125 చ.గ.ల నిర్మాణాలకు అనుమతులు అక్కర్లేదు
పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ.. ప్రతి డివిజన్‌కు 4 కోట్లు
వరదలతో నష్టపోయిన వారి ఖాతాల్లో 25 వేలు
ఇప్పటికే 10 వేలు అందితే మిగిలిన 15 వేలు జమ
జీహెచ్‌ఎంసీకి ట్రస్టీగా ఉంటాం: ఫడణవీస్
ఓపెన్ నాలాలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు సుమేధ పేరిట కొత్త చట్టం తీసుకొస్తాం. దీని కోసం రూ.10 వేల కోట్లతో నిధి ఏర్పాటుచేస్తాం. ‘నమామి గంగ’ తరహాలో మూసీ ప్రక్షాళన చేపడతాం. జీహెచ్‌ఎంసీని ప్రైవేటు ఆస్తిగా సీఎం కేసీఆర్, మజ్లిస్ అధినేత ఒవైసీ మార్చుకున్నారు. దీనిని తిరిగి ప్రజల ఆస్తిగా మార్చడమే బీజేపీ లక్ష్యం.
- బీజేపీ నేత ఫడణవీస్
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నగర ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని, ఇందుకు సమర్థ ఆరోగ్య ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకంతో నగరవాసులపై రూ.15 వేల కోట్ల భారం పడుతోందని, తాము గెలిస్తే ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేస్తామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు లేకుండా కట్టుదిట్టమైన చట్టం అమలు చేస్తామన్నారు.
‘‘వరదలతో నష్టపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల నగదు జమ చేస్తాం. ఇప్పటికే రూ.10 వేలు సాయం అందుకున్న వారికి మిగతా రూ.15 వేలు జమ చేస్తాం. నీటమునిగిన కాలనీలు, బస్తీలు మళ్లీ వరద బారిన పడకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం’’ అని వివరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులతో కలిసి గురువారం ఆయన బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
మెట్రో, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు సహా అనేక వరాలు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్ష మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. సొంత ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, ఇప్పటికే కట్టిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓపెన్ నాలాలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు సుమేధ పేరిట కొత్త చట్టం తీసుకొచ్చి రూ.10 వేల కోట్లతో నిధి ఏర్పాటుచేస్తామని తెలిపారు. ‘నమామి గంగా’ తరహాలో మూసీ ప్రక్షాళన చేపడతామని చెప్పారు. మూసీకి ఇరువైపులా రోడ్లను నిర్మించడంతోపాటు పార్కులతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు.
‘‘జీహెచ్‌ఎంసీని ప్రైవేటు ఆస్తిగా సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత ఒవైసీ మార్చుకున్నారు. దీనిని తిరిగి ప్రజల ఆస్తిగా మార్చడమే బీజేపీ లక్ష్యం. జీహెచ్‌ఎంసీకి ట్రస్టీగా ఉంటాం తప్ప యజమానులుగా కాదు’’ అని స్పష్టం చేశారు. కాగా, అభివృద్ధి, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా మేనిఫెస్టో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే ఈ మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.
అయితే, బీజేపీ మేనిఫెస్టోలో మాత్రం ‘నగరంలో ప్రతి ఒక్కరూ ఉచితంగా కరోనా టెస్టులు చేయించుకునే సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తాం’’ అని పేర్కొనడం గమనార్హం.
టీఆర్‌ఎ్‌సది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని బీజేపీ అమ్మేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్పృహలోకి వచ్చి మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మత కల్లోలాల కుట్రకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న కచ్చితమైన సమాచారం ఏమి ఉందో వెంటనే ముఖ్యమంత్రే వెల్లడించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఓయూకు వెళ్లిన తమ పార్టీ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చివేస్తామని ఎంఐఎం హెచ్చరిస్తే సీఎం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
‘‘హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా కేంద్రానికి వివరాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా రోహింగ్యాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేయాలో సరైన సమయంలో కేంద్రం చెబుతుంది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

మేనిఫెస్టో ప్రధానాంశాలు
సిటీ బస్సులు, మెట్రోలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం (అంతమేర రాయితీ సబ్సిడీని జీహెచ్‌ఎంసీ భరిస్తుంది).
ప్రతి కిలోమీటర్‌కు మహిళల కోసం ప్రత్యేకంగా టాయ్‌లెట్లు.
మహిళలకు భద్రత. కొత్తగా 15 మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు.
రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల సాయం. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా వర్తింపు.
ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటి సరఫరా. నల్లా లేని ప్రతి ఇంటికీ ఉచితంగా కనెక్షన్. ప్రతిరోజు నిరంతరాయంగా మంచినీటి సరఫరా.
సెలూన్లు, దోబీ ఘాట్లు, ఫుట్‌వేర్, నేతన్నలు, పరిమిత సంఖ్యలో గేదెలు, కోళ్ల పెంపకం చేపట్టే వారికి ఉచిత విద్యుత్తు, ఉచిత నల్లా నీళ్లు.
సెలూన్లకు సున్నా వడ్డీతో ఏటా రూ.15వేల రుణం.
ఎస్సీ కాలనీలు, మురికివాడల్లో ఆస్తిపన్ను పూర్తిగా మాఫీ
టూవీలర్, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న పెనాల్టీ చలాన్లు రద్దు
అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, ఫ్రీ వైఫై. అన్ని మురికివాడల్లో ఉచిత వైఫై.
125 గజాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు
అమృత్‌సిటీలో హైదరాబాద్‌ను చేర్చి..కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తాం.
నలువైపులా డంపింగ్ యార్డులు, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తికి గ్రీన్ ఎనర్జీ యూనిట్ల ఏర్పాటు
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ. కరోనాతో చితికిపోయిన ప్రైవేటు స్కూళ్లకు రాయితీలు. ఆరు నెలలవిద్యుత్తు బిల్లులు మాఫీ చేయడంతోపాటు ఆస్తి పన్ను వాణిజ్య కేటగిరీ నుంచి గృహ కేటగిరీకి మార్పు
యువతకు ఉపాధి యోజన
గ్రేటర్ మోడర్న్ బస్తీగా పాతబస్తీ. ఇందుకు ప్రత్యేక ప్యాకేజీ. అక్కడ ఉన్న చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణతోపాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధుల కేటాయింపు.

కరోనాతో ఇబ్బందిపడ్డ వ్యాపారులకు లైసెన్సు ఫీజులో రాయితీ.
గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మెట్రో సేవల విస్తరణ. పాతబస్తీకి, ఎయిర్‌పోర్టు వరకు, లింగంపల్లి నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో విస్తరణ. మియాపూర్ నుంచి సంగారెడ్డికి కనెక్టివిటీ ఉండేలా ఎంఎంటీఎస్ సేవల విస్తరణ.
కార్మికులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా
చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా స్పెషల్ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు. ప్రతి నెలా పబ్లిక్ డొమైన్‌లో చెరువుల సమాచారం. ఆక్రమణలకు గురైన నాలాలు, చెరువులపై సమగ్ర విచారణ.
జంక్షన్‌కి ఓ ఫ్లైఓవర్. ప్రధానకేంద్రాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు.
కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత. 14 వేల మందికి జీతాల పెంపు. హెల్త్ కార్డులు అందజేత
జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతన సవరణ. వారికి పన్నుల మాఫీ. పీఎంఏవై కింద ఆర్థిక సాయం. ఏడాదిలోగా 28 వేల ఖాళీల భర్తీ.
