కరోనా చికిత్స ఇలా..
ABN , First Publish Date - 2020-04-26T07:40:12+05:30 IST
కరోనా.. ప్రపంచాన్ని కల్లోల పెడుతున్న ఈ వైరస్ గురించి దాదాపుగా అందరికీ అవగాహన ఉంది. ..

మూడు కేటగిరీలుగా రోగుల విభజన
‘ఏ’ కేటగిరీలో 15-50 ఏళ్ల వయస్కులు..
50-70 వయసువారు ‘బీ’లోకి
ఆపై వయసు వారికి ‘సీ’ కేటగిరీ
వీరికే వెంటిలేటర్లపై చికిత్స అవసరం
వయసు, రోగ లక్షణాలను బట్టి చికిత్స
పిల్లలకు ప్రత్యేక కేటగిరీలో వైద్యం
రక్తం, లాలాజలం, ఎక్స్‌రే, సీటీస్కాన్ పరీక్షలతో కరోనా నిర్ధారణ
లక్షణాలు తగ్గితే డోస్ తగ్గింపు
14 రోజులు విటమిన్ సీ, బీ-కాంప్లెక్స్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్25 (ఆంధ్రజ్యోతి): కరోనా.. ప్రపంచాన్ని కల్లోల పెడుతున్న ఈ వైరస్ గురించి దాదాపుగా అందరికీ అవగాహన ఉంది. అయితే.. కరోనా సోకిన కొవిడ్-19 రోగు లకు చికిత్స ఎలా చేస్తారు? వారికి ఏయే ఔషధాలు ఇస్తారు? కరోనా నిర్ధారణ తర్వాత ఏయే పరీక్షలు చేస్తారు? వ్యాధి పూర్తిగా నయ మైందని ఎలా నిర్ధారిస్తారు? వీటికి సమాధా నాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్, గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగా ధిపతి డాక్టర్ వినయ్‌కుమార్ కొవిడ్-19 రోగు లకు అందిస్తున్న చికిత్స విధానాలను గురించి వివరించారు. కరోనా సోకిన వారందరికీ ఒకేరకమైన చికిత్స ఉండదని వారు చెబుతున్నారు. వయసు, రోగనిరోధక శక్తి, గత వైద్య చరిత్ర, ఇతరత్రా రుగ్మతలను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఆ వివరాలు..
రోగ నిరోధక శక్తే శ్రీరామ రక్ష..!
కరోనా సోకిన వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే.. పెద్ద సమస్య ఉండదు. వీరికి ఎలాంటి చికి త్స లు చేయకున్నా.. 14 రోజుల్లో వ్యాధి నయమ వుతుంది.
యువతకు ఇలా..
కరోనా సోకిన వారిలో 15-50 సంవత్సరాల వయసు ఉన్నవారిని ‘ఏ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరికి కరోనా లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీరిలో 80ు మందికి తక్కువ మోతాదులో చికిత్స అవసరం.
50-70 ఏళ్ల వారికి..
‘బీ’ కేటగిరిలో 50 నుంచి 70 ఏళ్ల లోపు వారు ఉంటారు. వీరి లో శ్వాసకోశ సమ స్యలు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలు ఉండే అవకాశముంది. ఇలాంటి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తారు. ఈ వయసు వారిలో ఇతర జబ్బులు ఉంటే.. రోగ నిరోధశక్తి తక్కువగా ఉంటుంది.
వయో వృద్ధులకు..
70 ఏళ్లకు పైబడిన వారిని ‘సీ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరినే నాలుగో దశ రోగులు అంటారు. వీరిలో ఎక్కువగా రకరకాల జబ్బులు ఉండడం, ఆయాసం, శ్వాస సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారికి కొన్నిసార్లు అత్యవసరంగా వెంటిలెటర్‌పై చికిత్సలు అందించాల్సి ఉంటుంది.
ప్రత్యేక కేటగిరీలో పిల్లలు..
నవజాత శిశువులకు, చిన్నారులకు వైరస్ సోకితే వారిని ప్రత్యేక కేటగిరీగా పరి గణిస్తారు. గాంధీ ఆస్పత్రిలో 6వ అంతస్తులో వీరికోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
రోజూ పరీక్షలు..
పాజిటివ్ వచ్చిన రోగులకు వెంటనే చికిత్సను ప్రారంభి స్తారు. రోజూ 3సార్లు జ్వరం, బీపీ పరీక్షలు చేస్తారు.
ఔషధాలు ఇవే..
కొవిడ్-19 రోగులకు జ్వరానికి సంబంధించి పారాసిటమాల్ ఇస్తారు. జలుబు ఉంటే సిట్రిజెన్ మందులను అందజేస్తారు. ఆ రెండు లక్షణాలు తగ్గిపోగానే.. ఆ ఔషధాలను ఆపివేసి.. వారు పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి అయ్యే దాకా రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సీ, బీ-కాంప్లెక్స్ మాత్రలను ఇస్తారు. దగ్గు, జలుబు, జ్వరం తీవ్రతను బట్టి హైడ్రాక్సీక్లోరోక్విన్ కూడా డోస్‌ల వారీగా అందజేస్తారు. కరోనా రోగి ఆస్పత్రికి వచ్చేసరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఉంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్‌ట్రెస్ సిండ్రోమ్(ఏఆర్‌డీఎస్)గా పరిగణించి వెంట నే అతనికి ఆక్సిజన్, వెంటిలెటర్ ఏర్పాటు చేస్తారు. అత్యవసర చికిత్సలు అందిస్తారు. మధుమేహం, బీపీ ఉంటే దానికి తగిన విధంగా మందులు ఇస్తారు.
రోగ నిర్ధారణ ఇలా..
అనుమానితు డు ఆస్పత్రికి రాగానే రోగ లక్షణాలు గమనించిన వైద్యులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వస్తారు. జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు, శ్వాస అంశాలను ఆధారంగా చేసుకోని అతనికి కరోనా వైరస్ ఉంటుందని నిర్ధారణకు వస్తారు. అతడి రక్త నమునాలు, లాలాజలం, ఛాతీ ఎక్స్‌రే, సీటీస్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. ఆ నమూనాలను ల్యాబ్‌కు పంపి స్తారు. రోగ లక్షణాలు ఉండీ, రిపోర్టులో నెగటివ్ వస్తే.. మరోసారి ఛాతీ ఎక్స్‌రే తీసి, సీటీస్కాన్ చేసి, ఆక్సిజన్ స్థాయులను పరిశీలిస్తారు. రిపోర్టుల ఆధారంగా మరోమారు ఓ నిర్ధారణకు వస్తారు.
యాంటీబయాటిక్స్ 5 రోజులు
కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వ్యక్తులకు మొదటి 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఆ తర్వాత రోగి ఆరోగ్యంలో మార్పు కనిపించకపోతే.. ఛాతీ ఎక్స్‌రే తీస్తారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందా? అనే విషయాన్ని గమనించి.. దాని ఆధారంగా మెడికేషన్‌లో మార్పులు చేస్తారు. డోస్‌ను కాస్త పెంచుతారు. ఇలాంటి రోగుల ఊపిరితిత్తుల్లో నీరు చేరితే కిడ్నీ, కాలేయం దెబ్బతింటాయి.
9వ రోజు నమూనాల సేకరణ
వారం పాటు చికిత్సల తర్వాత.. 8వ రోజుగానీ, 9వ రోజుగానీ రోగి నమునాలను మరోసారి సేకరిస్తారు. మరోసారి పాజిటివ్ వస్తే.. అప్పటి వరకు ఇచ్చిన మందుల డోస్ పెంచుతారు. ఆ తర్వాత.. 13వ రోజు ఒకసారి, 14వ రోజు రెండో సారి నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రెండు పరీక్షల రిపోర్టులు నెగిటివ్ అని వస్తేనే రోగిని డిశ్చార్జి చేస్తారు.