ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్స
ABN , First Publish Date - 2020-05-18T08:38:34+05:30 IST
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ వైద్యసేవలతోపాటు కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనలు పాటిస్తూ చికిత్స అందించాలని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు

- సాధారణ వైద్యసేవలకూ సర్కారు గ్రీన్‌సిగ్నల్
- ప్రభుత్వ వైద్యానికి కొందరి విముఖత వల్లే!
- నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రులపై చర్యలు
- మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ వైద్యసేవలతోపాటు కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనలు పాటిస్తూ చికిత్స అందించాలని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ కారణంగా మార్చి చివరివారం నుంచి ప్రైవేటు ఆస్పత్రులన్నీ వైద్య సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు వైర్‌సకు భయపడి స్వచ్ఛందంగా మూసివేసుకున్నాయి. దీంతో సాధారణ వైద్యసేవలతోపాటు ఇతర సేవలు అందక రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి వైద్య సేవలందించాలని, వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్య సేవల పరంగా ఆస్పత్రులను మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రైవేటు క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు మొదటి కేటగిరీ కాగా, రెండోది ఇన్‌పేషంట్ సౌకర్యం లేని నర్సింగ్ హోమ్‌లు, మూడోది ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులు. ఈ ఆస్పత్రులు పాటించాల్సిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
ప్రైవేటు క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లలో..
గంటకు నలుగురైదుగురు రోగులకు మాత్రమే అపాయింట్‌మెంట్ ఇచ్చి పరీక్షించాలి. రోగితో పాటు ఒక్క సహాయకుడే ఆస్పత్రికి రావాలి.
భౌతిక దూరం తప్పనిసరి. అందరూ మాస్కులు ధరించాలి. క్లినిక్‌లోకి వచ్చేముందే సబ్బుతో లేదా శానిటైజర్స్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి.
అన్ని రకాల జ్వరం, ఫ్లూ లక్షణాలతో ఉన్న రోగులను కొవిడ్ ఆస్పత్రికి పంపాలి.
సాధారణ జ్వరం, ఫ్లూతో వచ్చేవారి కోసం ఓపీలో ప్రత్యేక కౌంటర్, ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలి. వైద్య సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు ధరించాలి.
వైద్యులు, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు.. త్రీ లేయర్‌మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలి.
ఆస్పత్రిలో చేతులు కడుక్కునేందుకు, శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి.
ఆస్పత్రిని ప్రతి రోజూ ఒక శాతం సోడియం హైప్లోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి.
కేంద్ర మార్గదర్శకాల మేరకు అవసరమైన చోట టెలి మెడిసిన్ విధానాన్ని అవలంబించవచ్చు ప్రైవేటు క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లకు సూచించిన మార్గదర్శకాలనే నర్సింగ్ హోంలు పాటించాలి.
కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో..
క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, నర్సింగ్ హోంలకు సూచించిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలి.
అనుమానిత రోగులు వస్తే.. వారి పరీక్షా పలితాలు వచ్చేవరకు ఐసోలేషన్ రూమ్‌లో ఉంచాలి.
ల్యాబ్ టెక్నీషియన్లు స్వాబ్‌లు తీసేటప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
రోగుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను, ఆస్పత్రిలో కొవిడ్ జోన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
కొవిడ్ జోన్‌లో వైరస్ లక్షణాలున్న వారి కోసం ఐసీయూ, వెంటిలేటర్ ఏర్పాటు చేయాలి.
ప్రతి పాజిటివ్ రోగిని అవసరాన్ని బట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనస్తటిస్టు ఇతర సంబంధిత స్పెషలిస్టులు వారిని పరీక్షించాలి.
కరోనా సోకిన వారికి వీడియో కౌన్సెలింగ్ చేయాలి. వారి సహాయకులకు రోగి పరిస్థితిని వివరించాలి.
ఒకవేళ మరణిస్తే మృతదేహాన్ని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం డిస్పోజ్ చేయాలి.
ప్రతి ఆస్పత్రి విధిగా మరణాల వివరాల రిజిష్టర్ నమోదు చేయాలి. వైరస్ లేదా నాన్ వైర్‌సతో చనిపోయిన వివరాలను డీఎంహెచ్‌వోలకు పంపాలి.
టీకాల షెడ్యూల్‌ను యథావిధిగా నడపాలి. రోజువారీ ఫాలోఅప్ కేసులకు టెలి మెడిసిన్ విధానాన్ని అవలంబించాలి.
వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలి.
ప్లూ, జ్వరం, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారు, గర్భిణుల వివరాల డేటాను నమోదు చేసి ఈ-బర్త్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
పాజిటివ్ రోగుల వివరాలను నమోదు చేస్తూ, వాటిని డీఎంహెచ్‌వోలకు తెలపాలి. ఇన్ పేషంట్ రోగులు, శస్త్రచికిత్సల వివరాలనూ నమోదు చేయాలి. అవసరమైన మేరకు వాటిని జిల్లా వైద్య అధికార యంత్రాంగానికి పంపాలి.
వైరస్ సోకిన రోగులు.. ఇతర రోగులను కలవకుండా చర్యలు చేపట్టాలి.
ఈ మార్గదర్శకాలను పాటించకపోతే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో హెచ్చరించింది.
ప్రైవేటుకు అనుమతి అందుకే..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రోగులకు ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సర్కారు ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతుండడం, కొందరు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేందుకు విముఖత చూపుతుండటంతో సర్కారు తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు ముందుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా కాకుండా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒకటి రెండు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నాయి.
బోధన, టీవీవీపీ ఆస్పత్రుల్లో.. ప్రత్యేక విభాగాలు
రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో జ్వర లక్షణాలతో వచ్చేవారి కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో.. ఈ వైరస్ సోకిన వారు, సాధారణ రోగులు కలిసి ఆస్పత్రిలో ఒకేచోట చికిత్స చేయించుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.