కరోనా ‘కటింగ్‌’

ABN , First Publish Date - 2020-04-26T07:59:02+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి కుక్‌గా మారి గరిట తిప్పుతాడని అనుకున్నామా! ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ...

కరోనా ‘కటింగ్‌’

  • లాక్‌డౌన్‌తో సెలూన్లు మూత
  • భార్యలకు తలలప్పగిస్తున్న భర్తలు
  • ‘చేయి చేసుకుంటున్న’ తండ్రులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మెగాస్టార్‌ చిరంజీవి కుక్‌గా మారి గరిట తిప్పుతాడని అనుకున్నామా! ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ఇంటిపనుల్లో తలమునకలవుతారని ఊహించామా! టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన భార్యతో హెయిర్‌ స్టైల్‌ చేయించుకుంటాడని భావించామా! ఊహకందని ఇలాంటి దృశ్యాలెన్నో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆవిష్కృతమవుతున్నాయి. నిత్యం తమతమ పనుల్లో బిజీగా ఉండే ఈ సెలబ్రిటీలు.. ప్రస్తుతం కరోనా ఎఫెక్టుతో ‘స్టే ఎట్‌ హోం.. స్టే సేఫ్‌’ అంటున్నారు. అయితే, ఇంట్లో ఖాళీగా గడపడం అలవాటు లేని ఈ తారలు.. ఇంటి పనుల్లో బిజీగా మారుతున్నారు. సినిమాల ద్వారానే కాదు.. సామాజిక మాద్యమాల ద్వారా కూడా ఎప్పుడూ జనంతో టచ్‌లో ఉండే వీళ్లు.. లాక్‌డౌన్‌ వేళ సామాన్యులు ఎదుర్కొంటున్న ఓ విచిత్రమైన సమస్యకు పరిష్కారం చూపా రు. సెలూన్లన్నీ మూతపడడంతో.. కటింగ్‌ చేసే దిక్కులేక అనేకమంది జుత్తు, గడ్డం పెంచేసుకుని.. గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారు. చెప్పుకుంటే నవ్వుతెప్పించే వీళ్ల కటింగ్‌ కష్టాలకు.. ఓ మంచి పరిష్కారం దొరికింది. 


భార్యే బార్బర్‌గా మారిన వేళ..

గౌతమ్‌ (పేరు మార్చాం).. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఈ మధ్యే పెళ్లయుంది. పెళ్లికి ముందు నుంచీ కటింగ్‌ చేయించుకోవాలని అనుకుంటున్నాడే గానీ టైం లేక కుదరలేదు. ఇప్పుడేమో లాక్‌డౌన్‌ పుణ్యమాని కావలసినంత టైం ఉంది. కానీ.. కటింగ్‌ చేసేవారే కరువయ్యారు. సెలూన్లన్నీ మూతపడ్డాయి. ఎప్పుడూ ట్రిమ్‌గా ఉండే గౌతమ్‌.. ఇప్పుడు పెరిగిన జుత్తుతో, మాసిన గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నాడు. పైగా, చూసినవాళ్లందరూ ‘మొన్ననే కదా పెళ్లిచేసుకున్నావ్‌.. అప్పుడే అలా అయిపోయావేంటి! అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ‘మొగుడు కొట్టినదానికి కాదు.. తోడికోడలు నవ్వినందుకే’ అన్న సామెతలా తయారైంది అతడి పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో ట్విటర్‌లో కేటీఆర్‌.. ‘మీకు కటింగ్‌ చేసే అవకాశాన్ని మీ భార్యకు కల్పించండి’ అంటూ ఓ నెటిజన్‌కు ఇచ్చిన సలహాను చూశాడు. ఇదేదో బాగానే ఉందే! అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టేశాడు. మొదట కాస్త తటపటాయించినా.. అతడి భార్య కూడా చివరికి ఒప్పుకుంది. ఏదైతేనేం.. అతడి తల భారం తీరింది.  


లాక్‌డౌన్‌ దెబ్బకు మొక్కు బలి..

రమేష్‌ (పేరు మార్చాం).. ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. తిరుమల మొక్కు ఉండడంతో 6 నెలలుగా  తన ఇద్దరు పిల్లలు సహా అతడు సెలూన్‌కు దూరంగా ఉంటున్నాడు. అంతా సవ్యంగా జరిగుంటే.. ఈ పాటికి తిరుమల మొక్కు పూర్తయ్యేది. అనుకోకుండా వచ్చిన లాక్‌డౌన్‌.. అతడిని ఊహించని కష్టాల్లోకి నెట్టింది. విపరీతంగా పెరిగిన జుత్తు చికాకు పుట్టిస్తోంది. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మొక్కు పక్కనబెట్టి సెలూన్‌కు వెళదామంటే ఒక్కటీ లేదాయే! సరే.. ఇక తప్పదనుకుని తన చేతికే పనిచెప్పాలని నిశ్చయించుకున్నాడు. దగర్లోని షాపుకు వెళ్లి ఓ మాంచి కత్తెర, రేజరు కొనుగోలు చేశాడు. ముందుగా ఇద్దరు పిల్లల్నీ కూర్చోబెట్టి వారి జుత్తును అందినకాడికి కత్తిరించేశాడు. పనిలో పనిగా భార్యను పలిచి తన తలను ఆమెకు అప్పగించాడు. హమ్మయ్య! ఓ పనైపోయిందనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచాడు. 


నగరంలో ప్రస్తుతం ఎక్కువగా ఇలాంటి కథలే వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు చింపిరి జుత్తుతో, పెరిగిపోయిన గడ్డంతో దేవదాసుల్లా కనిపించిన వారందరూ.. నేడు మన సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకుని స్వీయ క్షవరాలతో మళ్లీ ట్రిమ్‌గా కనిపిస్తున్నారు.   ఈ స్థితి ఓ విధంగా కుటుంబాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొస్తోంది.  కత్తెర్లు, ట్రిమ్మర్లకు యమ డిమాండ్‌

కరోనా దెబ్బతో కత్తెర్లు, ట్రిమ్మర్లు, షేవింగ్‌ కిట్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. కొందరు ఆన్‌లైన్లో ఆర్డర్లు చేసి తెప్పించుకుంటుంటే.. మరికొందరు సూపర్‌ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కత్తెర్లు, షేవింగ్‌కిట్లకు డిమాండ్‌ పెరిగిపోయిందని షాపుల యజమా నులంటున్నారు.

Updated Date - 2020-04-26T07:59:02+05:30 IST