నేడు కేంద్రం కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-24T09:06:17+05:30 IST

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ర్యాండమ్‌గా ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

నేడు కేంద్రం కరోనా పరీక్షలు

మూడు జిల్లాల్లో ర్యాండమ్‌గా టెస్టులు.. దేశవ్యాప్తంగా నిర్వహణకు నిర్ణయం

తెలంగాణలో నల్లగొండ, వికారాబాద్‌, జనగామ జిల్లాల్లో నిర్వహణకు సిద్ధం

నేడు నల్లగొండకు ఐసీఎంఆర్‌ బృందం.. 400 మందికి ర్యాండమ్‌ పరీక్షలు

4 నెలల్లో 2 వేల మందికి టెస్టులు.. పాజిటివ్‌ కేసులకు ఇక జిల్లాలోనే చికిత్స


నల్లగొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ర్యాండమ్‌గా ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ర్యాండమ్‌గా అంటే.. లక్షణాలు ఉన్నా, లేకున్నా ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని కొంతమందికి పరీక్షలు చేయడం. ఈ పరీక్షలకు తెలంగాణలో నల్లగొండ, జనగామ, వికారాబాద్‌ను ఎంచుకున్నారు. ఈమేరకు ఐసీఎంఆర్‌ అధికారులు శుక్రవారం నల్లగొండ జిల్లాకు రానున్నారు.జిల్లాలో ఇప్పటివరకూ 549 మందిని పరీక్షించగా.. 15 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో క్లస్టర్‌ నుంచి 400 నమూనాలు సేకరిస్తారు. 15 నిమిషాల్లో పరీక్ష ఫలితాలు వెల్లడిస్తారు. 15 రోజుల తర్వాత మరోసారి జిల్లాలో 400 శాంపిళ్లు సేకరిస్తారు. అనంతరం వరుసగా మూడు నెలలపాటు ప్రతి నెలా 400 శాంపిళ్లు పరీక్షిస్తారు.


రాబోయే నాలుగు నెలల్లో 2వేల మందికి పరీక్షలు చేస్తారు. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడమే ఈ పరీక్షల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాంధీలో కరోనా పాజిటివ్‌ కేసుల ఒత్తిడి పెరుగుతుండడంతో.. జిల్లా కేంద్ర ఆస్పత్రులు, వెంటిలేటర్లు ఉన్నచోట పాజిటివ్‌ కేసులకు జిల్లా కేంద్రాల్లోనే ట్రీట్‌మెంట్‌ చేయాలని జిల్లాలకు ఆదేశాలు అందాయి. ఈమేరకు నల్లగొండలో కొవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌ వార్డును సిద్ధం చేశారు. ఇకపై పాజిటివ్‌ కేసులకు జిల్లాల్లోనే కరోనా చికిత్స నిర్వహించాలని కూడా సర్కారు నిర్ణయించింది. 

Updated Date - 2020-04-24T09:06:17+05:30 IST