గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌

ABN , First Publish Date - 2020-05-11T09:56:44+05:30 IST

రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో..

గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌

  • రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 59.3ు ఇక్కడే
  • మొత్తం కేసులు 1196.. హైదరాబాద్‌లో 710
  • మే నెలలో మొదటి 10 రోజుల్లో 143 కేసులు

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1196 మందికి వైరస్‌ పాజిటివ్‌ రాగా.. వారిలో 710 మంది గ్రేటర్‌వాసులే. అంటే.. మొత్తం కేసుల్లో 59.3ు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మార్చి 2న సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నమోదైంది. నాటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్‌ మూడోవారం నుంచి ఆ వేగం మరింత పెరిగింది. ఏప్రిల్‌21 నుంచి మే 10 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 313 కేసులు నమోదయితే అందులో 233 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే. అందులో 143 కేసులు గత పది రోజుల్లో (మే నెలలో) నమోదైనవే. శనివారం (మే 9న) నమోదైన 31 కేసుల్లో 30.. ఆదివారంనాటి 33 కేసుల్లో 26 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


ఇలా రెట్టింపు...

తొలి కేసు నమోదు అయిన మార్చి 2 నుంచి జనతా కర్ప్యూ అయిన మార్చి 22 వరకు గ్రేటర్‌లో సగటున ప్రతి 3.5 రోజులకూ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిం ది. ఆ తర్వాత.. తొలి విడత లాక్‌డౌన్‌ దశ అయిన మార్చి 23 నుంచి  ఏప్రిల్‌ 3 వ రకూ ప్రతి  నాలుగు రోజులకూ కేసులు సంఖ్య రెట్టింపు అయింది. ఏప్రిల్‌ 7 నుంచి మే 3 వరకు కేసులు డబుల్‌ కావడానికి 21 రోజులు పట్టింది. మే 5 తరువాత కేసుల నమోదు బాగా పెరిగింది. అయితే, గత కొద్ది రోజులుగా.. వైరస్‌ సోకినవారితో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్టుల్లో లక్షణాలున్నవారికే పరీక్షలు చేస్తున్నారు. దీనిపై ప్రజ ల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారి ఒత్తిడి మేరకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగి.. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కూడా.. పాజిటివ్‌ వచ్చినవారితో కాంటాక్టు అయిన ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-11T09:56:44+05:30 IST