కరోనా దడదడ
ABN , First Publish Date - 2020-06-23T09:05:46+05:30 IST
రాష్ట్రంలో సోమవారం నమోదైన 872 కేసుల్లో అత్యధికంగా 713 ఒక్క గ్రేటర్‌లో నమోదైనవే. అమీర్ పేట ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16

- ఒక్కరోజే 872 కేసులు.. జీహెచ్‌ఎంసీలోనే 713 కేసులు
- 3,189 నమూనాల్లో 27 ు పాజిటివ్
- గంటకు సగటున 36 కొత్త కేసులు
- రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ రేటు
- గడిచిన ఆరు రోజుల్లో 2,999 కేసులు
- 8,674కు చేరిన కరోనా బాధితులు
- మరో ఏడుగురి మృత్యువాత
రాష్ట్రంలో కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 3,189 నమూనాలను పరీక్షించగా.. 872 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే.. 27.34 శాతం పాజిటివ్ రేటు. ప్రతి గంటకూ సగటున 36 మంది వైరస్ బారిన పడినట్టు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒకటి-రెండు రోజుల్లో.. 24 గంటల్లో వెయ్యి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో జూన్ 6న అత్యధికంగా 33 శాతం పాజిటివ్ రేటు నమోదు కాగా.. ఆ తర్వాత ఇదే అత్యధికం.
(హైదరాబాద్ న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో సోమవారం నమోదైన 872 కేసుల్లో అత్యధికంగా 713 ఒక్క గ్రేటర్‌లో నమోదైనవే. అమీర్ పేట ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్‌లో 6, మంచిర్యాలలో 5, మెదక్, కామారెడ్డిలలో 3, జనగాం, మహబూబాబాద్, కరీంనగర్‌లలో రెండేసి చొప్పున, వరంగల్ అర్బన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8674కు చేరింది. కాగా, ఈ నెలలో ఇప్పటివరకూ 5976 కేసులు నమోదయ్యాయి. సోమవారం 274 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 4005కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4452 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే.. కరోనా కారణంగా సోమవారం ఏడుగురు కన్నుమూశారు. దీంతో మరణాల సంఖ్య 217కు చేరింది.
టెస్టులు పెరిగే కొద్దీ..
రాష్ట్రంలో టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ రేటు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకు.. శనివారం పాజిటివ్ రేటు 17 శాతం ఉండగా, ఆదివారం అది 22 శాతంగా, సోమవారం 27.34 శాతంగా నమోదైంది. గత ఐదు రోజుల సగటు చూస్తే.. 22 శాతంగా నమోదు అయింది. జూన్ 17న రాష్ట్రంలో కేసుల సంఖ్య 5675 ఉండగా, జూన్ 22 నాటికి అది 8674కు చేరింది. కేవలం ఆరు రోజుల్లో 2999 కొత్త కేసులు. కరోనాపై పోరులో తొలివరుస యోధులైన పోలీసులు, వైద్యులపై కరోనా పంజా విసురుతోంది. కరోనా బారిన పడిన కాలాపత్తర్ ఏఎస్సై (47) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారంమరణించారు. దీంతో, కరోనాతో మృతి చెందిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పోలీసుల్లో 180 మందికి పైగా కరోనా బారిన పడడం.. వారిలో ఐదుగురు మరణించడం ఖాకీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే.. వైద్యులు కూడా భారీగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎంలో ఏడుగురు పీజీ వైద్యులకు వైరస్ సోకింది.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నెగెటివ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆయన గన్‌మన్‌కు నాలుగు రోజుల క్రితం పాజిటివ్ రావడంతో అతణ్ని ఆసుపత్రికి తరలించారు. రాజాసింగ్, ఆయనభద్రతా సిబ్బందిని హోం క్వారంటైన్ లో ఉంచి వారి నమూనాలు సేకరించి పరీక్షించారు. సోమవారం అందిన రిపోర్ట్స్‌లో రాజాసింగ్‌తో పాటు మిగిలిన వారికి కరోనా లేదని తేలింది.
మృతిచెందిన తొలి అల్లోపతి వైద్యుడు
కరోనా కాటుకు రాష్ట్రంలో తొలిసారి ఒక అల్లోపతి వైద్యుడు (77) బలయ్యారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివసించే ఆయన.. ఖైరతాబాద్‌లో ప్రైవేటు క్లినిక్ నడిపేవారు. గతంలో ఆయనకు జియాగూడలో క్లినిక్ ఉండేది. మూడు రోజుల క్రితం ఆయనకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను సికింద్రాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. ఆయన సోమవారం ఉదయం మరణించారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులకు వైరస్ నెగెటివ్ వచ్చింది. జియాగూడలో 40 ఏళ్లపాటు, ఆ తర్వాత ఖైరతాబాద్‌లో ప్రజలకు వైద్యసేవలు అందించిన ఆ వైద్యుడి మృతిపట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కేవలం రూ.100 నుంచి 150 వరకూ తీసుకుని.. అందులోనే మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు కూడా ఇచ్చేవారని తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా.. ఏం కాదంటూ భరోసా ఇచ్చేవారని, ఆయన్ను కోల్పోవడం తమకు ఎంతగానో బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.