కరోనా గర్భిణికి ప్రసవం

ABN , First Publish Date - 2020-05-09T10:37:18+05:30 IST

కరోనా వైరస్‌ సోకిన 22 సంవత్సరాల గర్భిణికి శుక్రవారం గాంధీ ఆస్పత్రి వైద్యులు సిజేరియన్‌ చేశారు. ఆమెకు బాబు పుట్టాడు. ఫలక్‌నుమాకు చెందిన ఆ మహిళ గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌గా గాంధీ ఆస్పత్రిలో చేరింది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ప్రసవతేదీ ఈ నెల 19గా

కరోనా గర్భిణికి ప్రసవం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సోకిన 22 సంవత్సరాల గర్భిణికి శుక్రవారం గాంధీ ఆస్పత్రి వైద్యులు సిజేరియన్‌ చేశారు. ఆమెకు బాబు పుట్టాడు. ఫలక్‌నుమాకు చెందిన ఆ మహిళ గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌గా గాంధీ ఆస్పత్రిలో చేరింది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ప్రసవతేదీ ఈ నెల 19గా వైద్యులు నిర్ణయించారు. అంతలోనే.. ఆమెకు వైరస్‌ సోకినట్టు తెలియడంతో గాంధీకి తరలించారు.


గాంధీ వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చి శస్త్రచికిత్స చేశారు. 3 కిలోల బరువుతో పండంటి మగ బిడ్డ పుట్టాడని.. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. నవజాత శిశువుకు కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకునేందుకు వైద్యులు ఆ బాబు నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రాష్ట్రంలో వైరస్‌ సోకిన గర్భిణికి ప్రసవం చేయడం ఇదే తొలిసారి. కాగా.. శిశువుకు వైరస్‌ సోకే అవకాశం దాదాపుగా లేదని భావిస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.


కరోనా సోకిన నిండు గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేసి.. తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.


ఇక.. శుక్రవారంనాడు రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 1132కు చేరింది. మరోవైపు.. వైరస్‌ బారిన పడినవారిలో 34 మంది కోలుకోవడంతో శుక్రవారం వారిని డిశ్చార్జ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడ్డ వారి సంఖ్య 720కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 376 మాత్రమే ఉన్నాయి. శుక్రవారం డిశ్చార్జ్‌ అయిన వారిలో ఓ 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. తొలుత ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికి కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం విశేషం. అలాగే మూత్రపిండాలు వైఫల్యం చెంది డయాలసిస్‌ చేయించుకుంటున్న  మరో రోగి కూడా కోలుకోవడం విశేషం. వీరిద్దరే కాకుండా ఐసీయూలో ఉండి చికిత్స పొంది.. చివరికి కరోనాపై గెలిచిన మరో ఇద్దరు కూడా శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు.  


మెల్లమెల్లగా..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా సోకిన ఇద్దరు వృద్ధులు శుక్రవారం మరణించారు. వారిలో ఒకరు అంబర్‌పేటకు చెందిన కానిస్టేబుల్‌ (75). మరొకరు జియాగూడకు చెందిన రిటైర్డ్‌ పోస్టల్‌ ఉద్యోగి (75). కాగా.. హైదరాబాద్‌లో ఇంతకు ముందు లేని ప్రాంతాలకు కూడా వైరస్‌ వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సార్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ వెనుక గురుమూర్తి కాలనీలో ఒకరికి, మూసాపేట పరిధిలోని అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో ఒకరికి  వైరస్‌ సోకినట్టు తేలింది. హయత్‌నగర్‌ డివిజన్‌, హుడాసాయినగర్‌ కాలనీలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో 18 నెలల బాలుడు కూడా ఉన్నాడు. కాగా.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన వలస కూలీ (50) ఒకరు ముంబైలో కరోనాతో గురువారం రాత్రి మృతి చెందారు. 


ఈఎ్‌సఐసీలోనూ ప్లాస్మా థెరపీ

కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ నిర్వహించేందుకు గాంధీ ఆస్పత్రితో పాటు.. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎ్‌సఐసీ హాస్పిటల్‌కు కూడా ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. ఈ చికిత్స చేయడానికి అనుమతి కోరుతూ దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకూ 28 ఆస్పత్రులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో మన రాష్ట్రంలోని గాంధీ, ఈఎ్‌సఐసీ ఆస్పత్రులు ఉండడం విశేషం. అయితే.. ప్రస్తుతం ఈఎ్‌సఐసీలో కరోనాకు చికిత్స చేయట్లేదు. ప్లాస్మా చికిత్స ప్రయోగాలకు అనుమతి రావడంతో అక్కడ కూడా కరోనాకు చికిత్స చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 83 ఆస్పత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆ జాబితాలో.. హైదరాబాద్‌లోని అపోలో, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)  ఆస్పత్రులు ఉన్నాయి. 

Updated Date - 2020-05-09T10:37:18+05:30 IST