కరోనా కల్లోలం: ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు
ABN , First Publish Date - 2020-04-22T04:01:03+05:30 IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు జిల్లాలపై..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాకు రజత్ కుమార్ సైనీ, గద్వాల్ జిల్లాకు రోనాల్డ్ రాస్, సూర్యాపేట జిల్లాకు సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించింది. లాక్‌డౌన్ నడుస్తున్నప్పటికీ తాజాగా ఈ మూడు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 23మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం కొత్తగా 8 మందిని డిశ్చార్జ్ చేశారు.
అయితే.. మంగళవారం తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సూర్యాపేటలోనే అత్యధికంగా వెలుగుచూడటం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26 మందికి కరోనా పాజిటివ్ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గద్వాల 2, నిజామాబాద్ 3, ఆదిలాబాద్‌లో 2, ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది.