మరో 33.. రాష్ట్రంలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-11T08:23:12+05:30 IST

రాష్ట్రంలో ఆదివారం మరో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో సడలింపునిచ్చిన...

మరో 33.. రాష్ట్రంలో పెరిగిన కరోనా కేసులు

  • అందులో ఏడుగురు వలస కార్మికులు
  • మిగిలిన కేసులన్నీ గ్రేటర్‌ పరిధిలోనివే
  • హైదరాబాద్‌లో ఇద్దరి మృతి

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం మరో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల్లో సడలింపునిచ్చిన ఐదు రోజుల వ్యవధిలో 99 కేసులు నమోదు కావడం గమనార్హం. అందులో 64 మందికి గత రెండు రోజుల(శని, ఆదివారాల్లో) వ్యవధిలోనే వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆదివారం నమోదైన 33 కేసుల్లో 26 హైదరాబాద్‌ పరిధిలోనివే. మిగిలిన ఏడు కేసులూ వలస కార్మికులవేనని... ఇప్పటివరకూ 11 మంది వలస కార్మికులకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారంనాటి కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 1196కు చేరింది. 751 మంది ఇప్పటికే కోలుకోగా.. 415 మంది చికిత్స పొందుతున్నారు. ఇక.. వైరస్‌బారిన పడినవారిలో జియాగూడకు చెందిన ఒక ప్లాస్టిక్‌ వ్యాపారి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. అలాగే, బర్కత్‌పుర ప్రాంతంలో 85 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. 38 పాజిటివ్‌ కేసులతో విలవిలలాడిన వికారాబాద్‌ జిల్లాలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరు మాత్రమే ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి ఆదివారం (మే 10) దాకా జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.

Updated Date - 2020-05-11T08:23:12+05:30 IST