రాష్ట్రంలో బాధితులు 90 వేలు
ABN , First Publish Date - 2020-08-16T09:37:22+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90 వేలను మించింది. కొత్తగా 1,863 మందికి పాజిటివ్....

- కొత్తగా 1,863 కరోనా కేసులు; 10 మంది మృతి
- భద్రాచలంలో కుటుంబాన్ని వెళ్లగొట్టిన యజమాని
హైదరాబాద్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90 వేలను మించింది. కొత్తగా 1,863 మందికి పాజిటివ్ వచ్చినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 90,259 మంది మహమ్మారి బారినపడినట్లైంది. తాజాగా 1,912 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జిలు 66,196కు చేరాయి. కాగా, 21,239 నమూనాలను పరీక్షించారు. 664 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 394, మేడ్చల్‌లో 175, రంగారెడ్డిలో 131,, సంగారెడ్డిలో 81, వరంగల్ అర్బన్‌లో 101, కరీంనగర్‌లో 104, సిరిసిల్లలో 90, జగిత్యాల, ఖమ్మంలో 61 నమోదయ్యాయి. మరో 10 మంది మృతితో.. మరణాల సంఖ్య 684 అయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కరోనా బాధితుడి కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టాడో యజమాని. బాధితుడు ఏరియా ఆస్పత్రిలో ఉండగా.. శనివారం అతడి కుటుంబ సభ్యులను బయటకు పంపి గదికి తాళం వేశాడు. ఈ క్రమంలో వారు డయల్ 100కు ఫోన్ చేశారు. కానిస్టేబుల్ వచ్చి ఇంటి యజమానికి అవగాహన కల్పించేందుకు యత్నించినా అంగీకరించలేదు. కాగా.. కరోనా లక్షణాలున్న మహిళను బంధువులు వదిలేసి వెళ్లగా పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటన శనివారం మంచిర్యాల జిల్లా పంగిడిసోమారంలో జరిగింది. బాధిత మహిళ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతుంది. పని లేకపోవడంతో బెజ్జూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అనారోగ్యానికి గురవడంతో మంచిర్యాలలో వైద్యులు పరీక్షించి కరోనా లక్షణాలున్నాయని చెప్పారు. అయితే, శుక్రవారం రాత్రి మహిళను బంధువులు పంగిడి సోమారానికి తీసుకొచ్చి వదిలివెళ్లారు. స్థానికులు సమాచారం ఇవ్వగా 108లో బెల్లంపల్లిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.