నాలుగో రోజూ తగ్గాయి!

ABN , First Publish Date - 2020-04-26T07:50:33+05:30 IST

రాష్ట్రంలో వరుసగా నాల్గో రోజూ కరోనా వైరస్‌ కేసులు తగ్గాయి. శనివారం కొత్తగా ఏడు మాత్రమే..

నాలుగో రోజూ తగ్గాయి!

  • కరోనా కొత్త కేసులు ఏడు
  • రాజధానిలో 6, వరంగల్లో ఒకటి 
  • మొత్తం పాజిటివ్‌లు 990

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా నాల్గో రోజూ కరోనా వైరస్‌ కేసులు తగ్గాయి. శనివారం కొత్తగా ఏడు మాత్రమే పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో ఆరు కేసులు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే నమోదయ్యాయి. మరో కేసు వరంగల్‌ అర్బన్‌ నుంచి నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. శనివారం నాటి కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 990కు చేరుకుంది. ఇప్పటివరకు 307 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 25 మంది వైరస్‌ కారణంగా చనిపోయారు.


ప్రస్తుతం తెలంగాణలో 658 యాక్టివ్‌ కేసులున్నాయి. గద్వాల పట్టణంలో కరోనా అనుమానిత లక్షణాలతో 19 సంవత్సరాల యువతి చనిపోయింది. ఇటీవలే కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె పనిమనిషిగా ఆమె పనిజేసినట్లు సమాచారం. చనిపోయిన యువతి గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నా, కరోనా మృతుడి ఇంటి ఎదుటే నివాసం ఉంటున్నా ఆమె నుంచి నమూనాలను సేకరించలేదు. 


  • పాలమూరు ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. జిల్లా నుంచి సేకరించిన 570 శాంపిల్స్‌లో రెండు మినహా అన్నింటి రిజల్ట్స్‌ వచ్చాయి. ఇప్పటికే నమోదైన 49 పాజిటివ్‌ కేసులే తప్ప, శనివారం కొత్తకేసులేవీ నమోదు కాలేదు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. వలస కూలీలందరికీ వచ్చే మూడు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాను ఇప్పటికే గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు. గద్వాలలో మీడియా ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన కాంటాక్టులోని నలుగురు జర్నలిస్టులు సహా పది మందిని హోంక్వారంటైన్‌ చేశారు. 
  • వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 సంవత్సరాల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. ఎర్రబెల్లి గ్రామాన్ని కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించారు. బాలుడు హన్మకొండ పూరిగుట్ట పాజిటివ్‌ వ్యక్తికి కాంటాక్ట్‌గా తేలింది. 
  • హైదరాబాద్‌ కాప్రాలో నివసించే టైలర్‌ కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామంతాపూర్‌ శ్రీరమణపురంలో కిరాణా దుకాణం నడుపుకునే రాజస్థానీవ్యాపారికి కరోనా వచ్చింది. బోడుప్పల్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన బేగంబజార్‌ పప్పు దినుసుల హోల్‌సేల్‌ వ్యాపారి ఇద్దరి కుతుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. మలక్‌పేటలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన సోదరులు 


ఇద్దరికి  కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు అనుమానిత రోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొత్తం 75 మంది హాస్పిటల్‌లో ఉన్నారు. వీరిలో 8 మంది పాజిటిట్‌ రోగులు కాగా మిగిలిన వారు అనుమానితులు.


సూర్యాపేటలో ఇటీవల పర్యటించిన సీఎస్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు జరిపితే సరిపోతుందని, ద్వితీయ, ఆపై చేయడం వల్ల సమయం వృథా అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో జిల్లా యంత్రాంగం గత మూడు రోజులుగా అదే పద్ధతిని అనుసరిస్తోంది. అలాగే, కట్టడి ప్రాంతాలు పెద్దగా ఉండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశాల మేరకు వాటి సంఖ్యను ఐదు నుంచి ఎనిమిదికి పెంచి చిన్నవిగా మార్పులు 

చేశారు.


ఏపీ.. వెయ్యి దాటేసింది! 

ఏపీలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. దేశంలో వెయ్యి కేసులు దాటిన 8వ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. శనివారం ఉదయం ప్రకటించిన 61 కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ల సంఖ్య 1,016కు చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో 25, కర్నూలులో 14, అనంతపురంలో 5, కడప, నెల్లూరులో 4, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-04-26T07:50:33+05:30 IST