శవాలతో సావాసం

ABN , First Publish Date - 2020-08-01T07:05:21+05:30 IST

వారు గాంధీ ఆస్పత్రిలో మార్చురీలో పనిచేసే సిబ్బంది. కరోనా లక్షణాలతో ఉన్నవారిని తాకాలంటే భయం వేసే పరిస్థితుల్లో మార్చురీలో భద్రపరిచేందుకు అక్కడి సిబ్బంది మృతదేహాలను ముట్టుకుంటారు. మృతదేహాలకు శానిటైజ్‌ చేసి కవర్లలో ప్యాక్‌ చేస్తారు

శవాలతో సావాసం

  • మృతదేహాలను ప్యాకింగ్‌ చేసేది వారే
  • ముఖాలు గుర్తించేందుకు కెమికల్స్‌తో శుభ్రం
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు
  • ‘గాంధీ’ కరోనా మార్చురీలో సిబ్బంది దైన్యం
  • పనిగంటలన్నీ శవాల మఽధ్యే.. భోజనమూ అక్కడే
  • నిద్రపోయినా మృతదేహాల ఆలోచనలే
  • బతుకుబండి లాగేందుకు 
  • తప్పడం లేదంటున్న సిబ్బంది


హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట జూలై31 (ఆంధ్రజ్యోతి): వారు గాంధీ ఆస్పత్రిలో మార్చురీలో పనిచేసే సిబ్బంది. కరోనా లక్షణాలతో ఉన్నవారిని తాకాలంటే భయం వేసే పరిస్థితుల్లో మార్చురీలో భద్రపరిచేందుకు అక్కడి సిబ్బంది మృతదేహాలను ముట్టుకుంటారు. మృతదేహాలకు శానిటైజ్‌ చేసి కవర్లలో ప్యాక్‌ చేస్తారు. చివరిచూపు కోసం ఆప్తులెవరైనా వస్తారేమోనన్న ఆలోచనతో ముఖాన్ని తాజాగా ఉంచేందుకు రసాయనాలను పూస్తుంటారు. మృతుల కుటుంబీకులెవరైనా వచ్చి భోరున విలపించి మనసు తేలికపర్చుకుంటారు గానీ.. ఆ రోదనలను చూసి వీరి గుండెలు బరువెక్కుతాయి!! ఆ భారం వారికి తీరదు! ఉద్యోగ బాధ్యతంతా శవాల మధ్యే. భోజనమూ అక్కడే. నిద్రపోయినా.. మెలకువగా ఉన్నా శవాల జ్ఞాపకాలే! కరోనా వారియర్స్‌గా గాంధీ ఆస్పత్రిలో కరోనా మృతుల కోసం విడిగా పెట్టిన మార్చురీ (ప్లాస్మా మార్చురీ)లో పనిచేస్తున్న అక్కడి సిబ్బంది దైన్యమిది.


కరోనాతో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 1000 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. రోజుకు సగటున 10మంది చనిపోతున్నారు. ఈ మృతదేహాలన్నీ నేరుగా మార్చురీకి వెళతాయి. దుర్వాసన రాకుండా ఉండేందుకు అక్కడి సిబ్బంది వెంటనే మృతదేహాలను ప్యాక్‌ చేస్తారు. మృతదేహాల ఫొటోలు తీసి గాంధీ వైద్యులతో అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేస్తారు. మృతదేహాలను ఎలుకలు, పందికొక్కులు, కీటకాలు తినకుండా సంరక్షిస్తుంటారు. కరోనా కేసులు రోజు రోజుకూ పెరగడం, అదేస్థాయిలో మరణాలు పెరుగుతుండటంతో ఆస్పత్రిలోని ప్లాస్మా మార్చురీకి శవాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అవి తారమారవ్వకుండా మార్చురీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చే కుటుంబసభ్యుల రోదనలతో తమ గుండెలు బరువెక్కుతాయని.. ఒక్కోసారి కుటుంబసభ్యుల ఆర్తనాదాలు భరించలేని స్థాయిలో ఉంటాయని ఓ ఉద్యోగి వాపోయారు. ఎక్కడ పని చేస్తున్నారంటూ ఎవరైనా అడిగితే గాంధీ ఆస్పత్రిలో అనే చెబుతామని.. మార్చురీలో అని చెబితే ఛీ కొడతారేమోనన్న భయంతో ఆ సంగతి చెప్పం అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైర్‌సతో మార్చురీలో మృతదేహాలు పెరుగుతుండటంతో భోజనం చేస్తున్నా కూడా శవాలే గుర్తుకొస్తున్నాయని.. సరిగా భోజనం చేయలేక, నిద్రపట్టక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇటీవల మార్చురీలో కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని కుటుంబ సభ్యులకు చూపించిన క్రమంలో తమది కాదని చెప్పడంతో అక్కడి సిబ్బంది కంగారు పడ్డారు. లోపం ఎక్కడ జరిగిందోనని ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు. గాంధీలో కరోనాతో చనిపోతే వారి ఫొటోలు తీసి భద్రంగా ఉంచడం, కుటుంబ సభ్యులకు అప్పగించడం వరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. 


ఊరిలోకి రానివ్వడం లేదు

మాది  కామారెడ్డి జిల్లా బిక్‌నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామం. నాలుగు నెలల నుంచి ప్లాస్మా మార్చురీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఆస్పత్రిలో కరోనా రోగులు చనిపోతే శవాలు మార్చురీకి చేరుతాయి. వాటిని ప్లాస్టిక్‌ పేపర్లో మూట కట్టి ఫొటోలు తీసి వాట్స్‌పలో పోస్టు చేసేంత వరకు మా బాధ్యత. నాకు భార్య నలుగురు పిల్లలు. అంతా ఊర్లోనే ఉన్నారు. నేను హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఒక్కణ్నే ఉంటున్నాను. భార్యాపిల్లలను చూడాలనిపిస్తుంటుంది. నాలుగు నెలలుగా భార్యాపిల్లలతో ఫోన్‌లో మాట్లాడడమే తప్ప ఇంటికి వెళ్లలేదు.

- ఎల్లయ్య, గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి 


తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం 

గాంధీ ఆస్పత్రి ఎదరుగా కవాడిగూడలో భార్య, కొడుకు, కూతురుతో ఉంటున్నాను. గాంధీ ప్లాస్మా మార్చురీలో 4 నెలల నుంచి పనిచేస్తున్నా. కరోనా పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయాలంటే భయం వేస్తున్నా తప్పదు కదా! ఇక్కడ ప్రతిరోజూ పదిమంది కొవిడ్‌ రోగులు చనిపోతుంటారు. మేము అందించే సమాచారం ప్రకారం మృతుల కుటుంబాలకు  గాంధీ వైద్యులు సమాచారం ఇస్తారు. ప్రతి రోజూ 3 షిప్టులు ఉంటాయి. 8 గంటలు పనిచేశాక శరీరం సహకరించదు. జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. తప్పని పరిస్దితిలో ఉద్యోగం చేయాల్సిన పరిస్ధితి.

- రవీందర్‌, గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి

Updated Date - 2020-08-01T07:05:21+05:30 IST