కరోనా మత్‌ డరోనా

ABN , First Publish Date - 2020-03-19T10:47:21+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలను సర్వత్రా స్వాగతిస్తుండగా కొన్ని పల్లెల్లో భయాందోళనలు

కరోనా మత్‌ డరోనా

జిల్లాలో ముందస్తు చర్యలు

బయటి నుంచి వస్తేచాలు... 

అనుమాన భయం

పకడ్బందీగా హైదరాబాద్‌కు 

తరలింపు.. పరీక్షలు

ఐసోలేషన్‌ ఆఫ్‌ హోమ్‌ 

నిబంధనలు అమలు


మహబూబాబాద్‌, ఆంధ్రజ్యోతి

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలను సర్వత్రా స్వాగతిస్తుండగా కొన్ని పల్లెల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. విదేశాలే కాదు... పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చారంటే చాలు... కరోనా భయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయం తాండవిస్తోంది. దీనికి తోడు విమానాశ్రయాల్లో సదరు ప్రయాణికులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ అనంతరం నెగిటివ్‌ ఫలితాలతో మనికట్టు పైన ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు గుర్తుకోసం ఉపయోగించే సిరాతో వేసిన స్టాంప్‌కు అనుగుణంగా స్వగృహాన్ని వీడకుండ ఉండాలన్న ఆంక్షలు కూడా ఆయా కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, బంధుత్వాలు. ఇతరత్రా అవసరాలతో విదేశాలు, ఇతర రాష్ట్రాలు వెళ్లివచ్చిన వారు స్వగృహ నిర్బంధంలోనే ఉండాల్సిన పరిస్థితి వారిని నైరాశ్యంలో ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తామేం తప్పు చేశాం. ఏమిటీ ఈ శిక్ష అంటూ లోలోనే కుంగిపోతున్నారు. బయట నుంచి వస్తే చాలు.... నశిఖ పర్యంతం గమనిస్తూ రావడం, సొంత ఇంట్లోనే కాదు... బంధుమిత్రులు కూడా అనుమానాస్పదంగా చూడడం. లాంటి అంశాలు వారిని వేదనకు గురిచేస్తున్నాయి. అంతేకాదు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి మణికట్టుపై వేసిన స్టాంపింగ్‌లు ముందు జాగ్రత్త చర్యగా గుర్తింపు కోసం అయినప్పటికి కుటుంబంలోనే కాదు బంధుమిత్రులు కూడ ఏమిటీ ఇది అంటూ వింతగా చూస్తున్నారని వాపోతున్నారు. పట్టణాల్లో ఇది సహజంగానే పట్టించుకోనప్పటికి పల్లెల్లో మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి కరోనా వైరస్‌ భయం గ్రామాలను కలవరానికి గురిచేస్తోంది. 


విదేశాల నుంచి వచ్చిన వారికి ఇలా....

జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన 35 ఏళ్ల యువకుడు ఈ నెల 12న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదేరోజు అక్కడ వైద్యాధికారులు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. నెగిటివ్‌ రిపోర్టు రావడంతో పద్నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ పంపించారు. 13న స్వగ్రామానికి చేరుకున్న యువకుడికి బుధవారం దగ్గు, జలుబు చేయడంతో వైద్యులకు సమాచారమిచ్చారు. వెంటనే ఒక ప్రత్యేక వాహానంలో ఆ యువకుడికి మాస్క్‌ తొడిగించి, కాళ్లకు, చేతులకు కూడ మాస్క్‌లు వేసి గోప్యంగా హైదరాబాద్‌కు తరలించారు. అప్పటికే విషయం ఆ గ్రామంతో పాటు మండలంలో కలకలంరేపింది.


కరోనా భయం కమ్మేసింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి ధనసరి శ్రీరామ్‌ను సంప్రదించగా లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి తొలుత స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో నెగిటివ్‌ వచ్చిందని ఆందోళన అవసరం లేదన్నారు. ఆపై స్వగ్రామానికి చేరి న యువకుడికి జలుబు, దగ్గు చేయడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌ ఫివర్‌ ఆస్పత్రికి పంపించి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. మరోపక్క గూడూరు మండల కేంద్రంలో పాముకాటుతో మృతి చెందిన బాలుడి అంత్యక్రియలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాడ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కూడ ఆమెరికా నుంచి ఇటీవలే వచ్చాడని గుర్తించిన వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికంగా పరీక్షలు నిర్వహించి ఆయన స్వగ్రామ పరిధి వైద్యాధికారులకు సమాచారమిచ్చారు. అదే మండలానికి చెందిన మరోకరు సౌదీలోని బెహరాన్‌ నుంచి వచ్చారని గుర్తించారు. బయ్యారం మండలంలో మరోకరు బ్యాంకాక్‌ పోయి వచ్చారని తెలిసి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ముగ్గుర్ని పద్నాలుగు రోజుల పాటు వారి స్వగృహాల్లోనే ఉండాలని ఆదేశించారు. 


14 రోజులు ఇంట్లోనే ఎందుకంటే.. 

కరోనా వైరస్‌ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలు కీలకంగా మారాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వెంటనే కరోనా వైరస్‌ సోకిందా...? లేదా.. ? అన్న విషయంలో వెంటనే పరీక్షలు నిర్వహించినప్పటికి పూర్తిస్థాయిలో స్పష్టత రాదని వైద్యాధికారులు చెబుతున్నారు. కనీసం పద్నాలుగు రోజుల పాటు వారిని స్వగృహాల్లోనే ఉంచి వారిపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడం అవసరమంటున్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబందనల ప్రకారం ఈ పద్నాలుగు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌పై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఈ నిర్ణీత కాలంలో సదరు వ్యక్తులకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఏమి సోకిన వెంటనే సంబంధిత వైద్యాధికారులు అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతల మధ్య హైదరాబాద్‌కు తరలించి అక్కడి ప్రత్యేక వార్డుల్లో పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏడుగురు వచ్చినట్లు అధికారులు ఆంగీకరిస్తున్నారు.


ఇందులో ఏ ఒక్కరికి కూడ కరోనా వైరస్‌ సోకలేదని స్వయాన కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతి మండలంలో వైరస్‌ స్ర్కీనింగ్‌ కోసం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ధర్మల్‌ స్కానల్‌ అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి దగ్గు, జ్వరం లేకున్న పద్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్‌ చేయాలని ఆదేశించారు. ఈ విధానంపై వెంటనే ట్రైనింగ్‌ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అంతేకాదు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో టోల్‌ఫ్రీ నంబర్‌ 8790232651 ఏర్పాటు చేసి అత్యవసర వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Updated Date - 2020-03-19T10:47:21+05:30 IST