కరోనా మరిచి పుష్కర సన్నాహాలు

ABN , First Publish Date - 2020-07-27T08:03:53+05:30 IST

కోరలు చాస్తున్నట్లుగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మరో నాలుగు నెలల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందా? గద్వాల జిల్లా యంత్రాంగం మాత్రం ఇదే

కరోనా మరిచి పుష్కర సన్నాహాలు

  • నవంబరులో తుంగభద్ర పుష్కరాలకు ప్రతిపాదనలు
  • అప్పట్లోగా కరోనా అదుపులోకి వస్తుందనే ధీమా
  • 30 కోట్ల అంచనాతో గద్వాల యంత్రాంగం సిద్ధం
  • వైరస్‌ దృష్ట్యా పునరాలోచించండి.. భక్తుల ఇళ్లకే నదీ జలాల పార్శిళ్లు... స్థానికుల సూచనలు

గద్వాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కోరలు చాస్తున్నట్లుగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మరో నాలుగు నెలల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందా? గద్వాల జిల్లా యంత్రాంగం మాత్రం ఇదే విశ్వాసంతో ఉన్నట్లుంది. నవంబరు 22 నుంచి జరిగే తుంగభద్ర నదీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర ప్రవహించే తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో 22 పుష్కరఘాట్లు నిర్మించడం ద్వారా మునుపెన్నడూలేనంత వైభవంగా పుష్కరాలు నిర్వహించాలని భావిస్తోంది. పుష్కరాల నిర్వహణకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో నదీ తీరంలో దేవాలయాలున్న 22 గ్రామాల్లో పుష్కరఘాట్లు, అక్కడ విద్యుత్తు, కనెక్టివిటీకి అవసరమైన లింకు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షలో చర్చింనున్నారు. ఈ పుష్కరాల కోసం దేవాదాయ శాఖ నుంచి ఆలయాల మరమ్మతులు, లైటింగ్స్‌ ఇతర ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ.2.65 కోట్లు కేటాయించారు. ఘాట్ల నిర్మాణాలు ఇతర సదుపాయాల కోసం రూ. 30 కోట్ల వరకు ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


నవంబరు మూడో వారం దాకా కరోనా అదపులోకి వస్తుందా? రాకున్నా కూడా పుష్కరాలను నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనం వస్తే అప్పుడు మహమ్మారి వ్యాప్తికి ఎగదోసినట్లవ్వదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై పునరాలోచించాలన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. సంప్రదాయానికి భంగం కలగొద్దని భావించి ఒకవేళ నిర్వహించాలనుకుంటే మాత్రం ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. భక్తులెవ్వరినీ అనుమతించకుండా నదీ జలాలను పార్శిళ్ల ద్వారా ఇళ్ల వద్దకే అందించే ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. తప్పనిసరై వచ్చే భక్తులను నదిలోకి దిగనీయకుండా పక్కన స్నానాల కోసం నల్లాలను ఏర్పాటు చేయాలని, అక్కడ భౌతిక దూరం పాటించేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  ప్రతిపాదిత ఘాట్లన్నింటి వద్ద నీటిశుద్ధికి అవసరమైన ట్యాంకులను నిర్మించాలని కోరుతున్నారు. భక్తులొచ్చే ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జరిగే సమీక్షలో ఇలాంటి ప్రతిపాదనలేవీ చేయలేదు. సాధారణ రోజుల్లో పుష్కరాలు నిర్వహిస్తే ఎలాంటి ఏర్పాట్లు చేస్తోరో వాటికి అనుగుణంగానే ప్రతిపాదనలను సిద్ధం చేశారు.   

Updated Date - 2020-07-27T08:03:53+05:30 IST