కరోనా ఫుడ్‌

ABN , First Publish Date - 2020-07-19T07:53:59+05:30 IST

లంగర్‌హౌజ్‌కు చెందిన సురేశ్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఇంటికి సరిపడా కిరాణం సామానుకు రూ.3500 దాకా అయ్యేది. దీనికి రూ.1200 కూరగాయలు అదనం. ఇప్పుడు కిరాణా సామానులో అదనంగా...

కరోనా ఫుడ్‌

మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు

భోజనంలో ఒక ఆకు కూర, రెండు కాయగూరలు మస్ట్‌ 

చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లలో ఏదో ఒకటి ఉండాల్సిందే

పులుపునకు ప్రాధాన్యం.. పప్పు, కూరల్లో నిమ్మరసం చుక్కలు  

తర్వాత పండ్లు.. బొప్పాయి, బత్తాయి, సంత్రాలకు ప్రాధాన్యం

అప్పుడప్పుడు కాజు, బాదం, కిస్‌మిస్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ నోట్లోకి 

లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కతో కషాయం 

రోగ నిరోధకశక్తి పెరిగేందుకు పోషకాహారానికి ప్రాధాన్యం 

పెరిగిన కిరాణా సరుకులు, కూరగాయల బడ్జెట్‌


లంగర్‌హౌజ్‌కు చెందిన సురేశ్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఇంటికి సరిపడా కిరాణం సామానుకు రూ.3500 దాకా అయ్యేది. దీనికి రూ.1200 కూరగాయలు అదనం. ఇప్పుడు కిరాణా సామానులో అదనంగా లవంగాలు, దాల్చిన చెక్క, శొంఠి, మిరియాలు తీసుకొస్తున్నాడు. కిరాణం ఖర్చు రూ.5వేల దాకా అవుతోంది. కూరగాయల కోసం ఎంత లేదన్నా రూ.2వేలు అవుతోంది. కిరాణం, కూరగాయలపై సురేశ్‌ నెలవారీ బడ్జెట్‌ రూ. 2,300 మేర పెరిగింది. గుడ్లు, చికెన్‌, మటన్‌, చేపల కోసం రూ.2వేల వరకు ఖర్చు చేస్తున్నాడు.


అత్తాపూర్‌కు చెందిన కిషోర్‌కు గతంలో పులుపు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కూరలో నోటికి కాస్త పులుపు తగిలితే కోపంతో భార్యపైకి ఇంతెత్తున లేచేవాడు. ఇప్పుడు ఆయనే వంటల్లో పులుపు కోసం నిమ్మరసాన్ని వేయమంటూ భార్యకు ప్రత్యేకంగా చెబుతున్నాడు. అంగడికి వెళితే నిమ్మకాయలు, బత్తాయి, ఆరెంజ్‌, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు కొంటున్నాడు.


..సురేశ్‌, కిషోరే కాదు సామాన్య ప్రజలందరి ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఆ మేరకు బడ్జెట్టూ పెరిగిపోయింది. కరోనా ప్రభావంతో ఆహార నియమాల్లో జాగ్రతలు పాటించడమే కాదు. పోషక విలువలున్న ఆహార పదార్థాలను ప్రజలు తీసుకుంటున్నారు. వివిధ రకాల కూరగాయలను ఎక్కువగా కొంటున్నారు. ఆదివారాలు తప్ప దూరంగా ఉండే మాంసాహారం ఇప్పుడు రోజువారీ భోజనంలో భాగమైంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లలో ఏదో ఒకటి  భోజనంలో ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. కాజు, కిస్‌మిస్‌, బాదాం వంటి డ్రై ఫ్రూట్స్‌ తింటున్నారు. బొప్పాయి, బత్తాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తి బాగా ఉంటే కరోనా ఏమీ చేయదన్న ధీమాతో ఆ మేరకు మెనూ కోసం ఎంత మొత్తాన్నయినా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ల  జనాభా 1.2 కోట్లు అయితే, వీరిలో 40ు మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. కరోనా కారణంగా వివిధ రంగాల్లో పనిచేసే వారికి వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇవ్వడంతో భార్య, భర్తలిద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. కరోనాకు ముందు తాము రోజూ ఒక కూరతోనే భోజనం కానిచ్చేవారమని,  ఇప్పుడు ఏదో ఒక ఆకుకూరతో పాటు రెండు, మూడు కూర లు ఉండేలా జాగ్రత్తపడుతున్నామని మాదాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ప్రతి కూరలో ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఉండేలా చూసుకుంటున్నామన్నారు. గతంలో కంటే భిన్నంగా కూరగాయలకు వారానికి రూ.500 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా పండ్ల కోసమే నెలకు రూ.2వేలు ఖర్చవుతోందని చెప్పారు.  


పెరిగిన పోషక పదార్థాల వినియోగం..

కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడమే ఇప్పుడు మార్గంగా కనిపిస్తుండటంతో గతంలో ఎన్నడూ వినని, చూడని పోషక పదార్థాల వైపు అన్ని వర్గాల ప్రజల చూస్తున్నారు.  రోజూ ఉదయాన్నే ముఖం కడిగిన తర్వాత వేడినీటిలో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని తాగుతున్నారు. తర్వాత  లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠిని దంచి వేడినీటిలో మరిగించి రోజుకు రెండు పూటలా తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అధిక బలాన్ని ఇచ్చే డ్రైఫూట్స్‌ను వాడుతున్నారు. బాదం పలుకుల్లో మంచి కొవ్వు, ఎన్‌-3 విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) శాస్తవేత్తలు చెబుతున్నారు. పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌, ఖర్జూరాలో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, బీ-6 విటమిన్లు ఉంటాయని, ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయని వారు పేర్కొంటున్నారు.  


రెండింతలు పెరిగిన ఖర్చులు 

ఇంట్లో తమకు నచ్చిన వంటలను తయారు చేసుకుంటుండటంతో పప్పు, ఉప్పు, నూనెల వాడకం మునుపటికన్నా రెండింతలు పెరిగిందని గచ్చిబౌలికి చెందిన జనార్దన్‌ తెలిపారు. నిత్యావసర వస్తువులతోపాటు కరెంట్‌ బిల్లులు, శానిటైజేషన్‌ ఖర్చులు ఎక్కువయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో కూరగాయలు, పండ్లు, సూపర్‌మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మోండా మార్కెట్‌లో కరోనాకు ముందు రూ.15 నుంచి రూ.25 వేల వరకు సుగంధ ద్రవ్యాలు, ఆలుగడ్డలు, అల్లం ఎల్లిగడ్డలు అమ్మిన రమేశ్‌ ప్రస్తుతం రూ. 35 వేల వరకు బిజినెస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చికెన్‌, మటన్‌ దుకాణాల్లో కూడా ఎప్పుడూ చూసిన జనం రద్దీనే కనిపిస్తోంది.  


డ్రైపూట్స్‌ ఎక్కువగా తింటున్నాం

వైద్యుల సూచనల మేరకు రోగ నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడే డ్రైపూట్స్‌ను ఎక్కువగా తింటున్నాం. ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత, సాయంత్రం 5 గంటలకు రెండు బాదం పలుకులు, జీడిపప్పు, కిస్‌మిస్‌ తీసుకుంటున్నాం. అలాగే అల్లం, శోంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, తాటిబెల్లంను ఉదయం పూట వేడినీటిలో మరిగించి కషాయంగా తాగుతున్నాం.           

- దుర్గా, బౌద్ధనగర్‌పోషక విలువలు పాటించాలి

రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టర్లుగా పేరొందిన బాదం పప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పు, అక్రూట్‌, ఖర్జూరాను తప్పకుండా వాడాలి. ఖర్చు కొంత ఎక్కువైనప్పటికీ, వీటిని వాడితే ప్రతి రోజు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతోంది.   

- లక్ష్మయ్య, ఎన్‌ఐఎన్‌ సైంటిస్ట్‌Updated Date - 2020-07-19T07:53:59+05:30 IST