క్లినిక్‌లకు కరోనా భయం!

ABN , First Publish Date - 2020-06-22T08:57:53+05:30 IST

చిన్న చిన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఒకవేళ తెరుచుకున్నా గతంలో వచ్చినట్లు జనాలూ ..

క్లినిక్‌లకు కరోనా భయం!

పూర్తిగా తెరుచుకోని ప్రైవేటు ఆస్పత్రులు

తెరిచినా వచ్చేందుకు జనం వెనుకంజ

ముంచుకొస్తున్న సీజనల్‌ వ్యాధులు

సొంత వైద్యంతో నెట్టుకొస్తున్న జనం

అవసరమైన రోగులకు ఇబ్బందులు

ప్రభుత్వాస్పతుల్లో సిబ్బంది కొరత


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): చిన్న చిన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఒకవేళ తెరుచుకున్నా గతంలో వచ్చినట్లు జనాలూ రావడం లేదు. దీనంతటికీ కారణం కరోనా భయం. దీనికితోడు వర్షాకాలం రావడంతో సీజనల్‌ వ్యాధులు కూడా మొదలయ్యాయి. సీజనల్‌ వ్యాధుల చికిత్సకోసం వెళ్దామనుకునేవారికి ఆస్పత్రులు తెరుచుకోకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలను ప్రారంభించాలని సర్కారు  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా, కరోనా భయంతో ఇంకా 30-40ు క్లినిక్‌లు తెరుచుకోలేదు. కరోనా భయంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు పూర్తిస్థాయిలో సేవలందించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో అన్ని రకాల ఆస్పత్రులు కలిపి 30 వేల వరకు రిజస్టర్‌ అయినవి ఉన్నాయి. కరోనా భయంతో వీటిలో చాలా వరకు క్లినిక్‌లు ఇంకా తెరుచుకోలేదు.


కొంతమంది వైద్యులైతే తమ క్లినిక్‌లను ఇప్పట్లో తెరవబోమని బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. కోటిపై చిలుకు జనాభా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఇప్పటికీ 30-40ు స్థానికంగా ఉండే గల్లీ, కాలనీ క్లినిక్‌లు తెరుచుకోలేదు. హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే, కొంతమంది వైద్యులు క్లినిక్‌లు తెరిచినా   రోగులు రావడంలేదు. దీంతో వాటిని మళ్లీ మూసివేస్తున్నారు. చిన్నచిన్న ఆస్పత్రులు, క్లినిక్‌లు, డాక్టర్‌ పేరుతో నడిచే నర్సింగ్‌హోమ్స్‌లకు జ్వరం జలుబు వంటి కరో నా అనుమానిత లక్షణాలున్న రోగులు వస్తే చూడటం లేదు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో జ్వరాలొస్తే చాలా మంది సొంత వైద్యంతో నెట్టుకొస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులవైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


వైద్య ఆరోగ్యశాఖలోనూ ఆందోళన

అసలే వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది కొరత ఉంది. కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో జిల్లాల్లో ఉన్న మెడికల్‌ ఆఫీసర్లను గ్రేటర్‌ హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై రప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో సీజనల్‌ వ్యాధులు మొదలైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యమందించేందుకు వైద్యులుండని పరిస్థితులు నెలకొంటాయని వైద్యశాఖ ఆందోళన చెందుతోంది. మరోపక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 300-400 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత మరింత పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   


సర్కారీలో 10,054 పోస్టులు ఖాళీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రజారోగ్య సంచాలకుడు, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో మొత్తం 7029 వైద్యుల పోస్టులు, 19,162 పారామెడికల్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 2407 వైద్యుల పోస్టులు, 7647 పారామెడికల్‌ పోస్టులు మొత్తం 10,054 ఖాళీగా ఉన్నాయి. అంటే 60ు సిబ్బందితోనే ఆస్పత్రులు పనిచేస్తున్నాయి.

 

బలవంతంగా ఉన్నా.. రెండు రోజులకే డిశ్చార్జ్‌ అయ్యా..శంకర్‌, కొత్తపేట

రెండు రోజులుగా జ్వరం వస్తే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లా. ఇన్‌పేషంట్‌గా అడ్మిట్‌ అవ్వాల్సివచ్చింది. కానీ ఎక్కడ కరో నా సోకుతుందోనని చాలా భయపడ్డా. ఆస్పత్రిలో 2రోజుల పాటు బలవంతంగా ఉన్నా. కొంచెం తగ్గగానే వెంటనే డిశ్చార్జ్‌ అయ్యా.


కేసుల భయంతో మళ్లీ బంద్‌ పెట్టాం...నారాయణగూడలో ఓ క్లినిక్‌ నిర్వహిస్తున్న వైద్యుడు

కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ క్లినిక్‌ను బంద్‌పెట్టాం. కొద్దిరోజుల పాటు క్లినిక్‌ తెరిచినా ప్రజలు గతంలోలా రావడం లేదు. ప్రభుత్వం ఎక్కువ మందికి టెస్టులు చేస్తే బాగుంటుంది. కనీసం యాంటీబాడీ టెస్టులు అయినా చేయాలి. అటువంటి వాటిని చేసే అవకాశం మాకు ఇవ్వాలి. అది అయితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. రోగులకు కూడా తమకు వైరస్‌ వచ్చింది లేనిది తెలిసిపోతుంది. 


రోజూ 5-6 మంది కూడా రావడం లేదు..డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, 

శ్రీ బాలాజీ సాయి క్లినిక్‌. మణికొండ.

రెండు వారాల నుంచి క్లినిక్‌ ఓపెన్‌ చేశాం. గతంలో రోజూ 25-30 మంది రోగు లు వచ్చేవారు. ప్రస్తుతం రోజూ 5-6 మించి రావడం లేదు. వచ్చేవారిలోనూ జ్వరం రోగులుండటం లేదు. బీపీ, షుగర్‌, పుళ్లుతో బాధపడేవారు ఉంటున్నారు. 

Updated Date - 2020-06-22T08:57:53+05:30 IST