‘కరోనాను దూరం పెడదాం.. ఫ్యామిలీకి దగ్గరవుదాం’
ABN , First Publish Date - 2020-03-24T00:45:32+05:30 IST
స్వీయ నిర్భందమే కరోనాకు శ్రీరామ రక్ష అని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు...

సిద్దిపేట జిల్లా : స్వీయ నిర్భందమే కరోనాకు శ్రీరామ రక్ష అని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. మనం గడప దాటకుండా కరోనాను పొలిమేర దాటిద్దామన్నారు. 24 గంటల జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన అందరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ పది రోజులు కరోనాను దూరం పెడదాం.. కుటుంబ సభ్యులకు మరింత దగ్గరవుదామని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సూచనలు పాటించండి!
‘ఎన్నో విషయాల్లో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనాను అడ్డుకునే క్రతువులోనూ సిద్దిపేట దేశానికి ఆదర్శం కావాలి. ఇప్పుడు మనం కరోనా మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమవ్వాలి. ప్రభుత్వ సూచనలను తు.చ తప్పకుండా పాటించండి. రోడ్లపై సమూహాలుగా గుమికూడవద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చే 10 రోజులు చాలా ముఖ్యం. కరోనాతో మనకేం కాదన్న అలక్ష్యం వద్దు. చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ప్రజలు అక్కడి ప్రభుత్వ సూచనలు పట్టించుకోకపోవడం వల్ల వేల మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదు. ప్రతీ రోజూ వందల సంఖ్యలో మరణిస్తున్నారు’ అని మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు.